ఆర్య బిరియాని విందు ఇవ్వలేదు

ఆర్య బిరియాని విందు ఇవ్వలేదు - Sakshi


నటుడు ఆర్య బిరియాని విందు ఇవ్వలేదని ఒకింత కినుకు భావంతో ఆరోపిస్తున్నారు నటి తమన్న. సౌత్, నార్త్ అంటూ బహు భాషా నటిగా బహుళ ప్రాచుర్యం పొందిన నటి తమన్న. 1989 డిసెంబర్ 21న ముంబయి లో సింధు కుటుంబంలో పుట్టిన ఈ మిల్కీ బ్యూటీ 2005లో నటిగా రంగ ప్రవేశం చేశారు. అలా దశాబ్దం కాలంగా తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ నాటౌట్‌గా తన హవాను కొనసాగిస్తున్నారు తమన్న. ద్విభాషా భారీ చారిత్రక చిత్రం బాహుబలిలో వైవిద్యభరిత పాత్రతో త్వరలో తెరపైకి రానున్నారు. ఈ సందర్భంగా దశాబ్దపు భామతో చిన్న భేటీ.

 

 ప్రశ్న: బాహుబలి చిత్రంలో మీ పాత్ర గురించి దర్శకుడు రాజమౌళి నుంచి సహనటి అనుష్క వరకూ గొప్పగా చెబుతున్నారు. అంతగా ఆ పాత్ర ప్రత్యేకత ఏమిటి?

 జ: బాహుబలి చిత్రం ప్రారంభానికి ఏడాదికి ముందు నుంచే ప్రీ ప్రొడక్షన్స్ మొదలయ్యాయి. చిత్రానికి సంబంధించిన అందరికి శిక్షణ ఇచ్చారు. ఇంత భారీ చిత్రంలో నేనిప్పటి వరకు నటించలేదు. ఇందులో రాణి అవంతికగా నటించాను. దుస్తులు, నగలు, నటనా ఇలా నటించడం నా వరకూ చాలా కొత్త అనుభవం. చిత్ర హీరో ప్రభాస్ శారీర దారుఢ్యానికి ధీటుగా ఉండాలని 3 కిలోల బరువు పెంచుకుని నటించాను. చిత్రంలో నాకు రెండు పాటలు ఉన్నాయి. పోరాట దృశ్యాల్లోనూ నటించాను. ఈ సన్నివేశాల కోసం నాలుగు నుంచి ఐదు రోజుల వరకు శిక్షణ పొంది నటించాను. తొలిసారిగా ఇలాంటి ఒక చారిత్రక కథా చిత్రంలో నటించడం మధురమైన అనుభవం.

 

 ప్రశ్న: సాంఘిక కథా చిత్రాల్లో నటించడానికి, బాహుబలి లాంటి చారిత్రక కథా చిత్రాల్లో నటించడానికి మధ్య వ్యత్యాసం?

 జ: వేష భాషలు, హావభావాలు, నడక, నర్తన ఇలా చాలా వ్యత్యాసం ఉంటుంది. పాత్ర కాదు రాణి గెటప్‌లోకి మారగానే మనమే మారిపోతాం. నేను అలా అవంతికగా మారిపోయాను.

 

 ప్రశ్న: చిన్న గ్యాప్ తరువాత తమిళంలో వాసు శరవణన్ ఒన్నా పడిచ్చ వంగ చిత్రంలో నటించడం గురించి?

 జ: ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఆగస్ట్‌లో తెరపైకి రానుంది. ఇందులో రొమాంటిక్ కామెడీ పాత్రలో నటించాను. ఇలాంటి పాత్రను నేనింతవరకూ చేయలేదు. తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది.

 

 ప్రశ్న: నటుడు ఆర్య అనగానే ఆయన బిరియాని గురించి ప్రస్తావించకుండా ఉండలేం. అలా హీరోయిన్ల మధ్య అంత పాపులర్. మరి మీ సంగతేమిటీ?

 జ: ఆర్య షూటింగ్ స్పాట్‌లో చాలా జాలీగా ఉంటారు. ఆర్య, సంతానం, దర్శకుడు రాజేష్‌ల గలాటాను బాగా ఎంజాయ్ చేశాను. అయితే అందరూ ఆర్య బిరియాని గురించి అడుగుతున్నారు. నాకు మాత్రం అలాంటి విందు ఇవ్వనేలేదు. బహుశా చిత్రం విడదలైన తరువాత గ్రాండ్‌గా బిరియాని పార్టీ ఇస్తారని ఎదురు చూస్తున్నాను.

 

 ప్రశ్న: తెలుగులో మీరు శ్రుతీహాసన్ చిత్రంలో సింగిల్ సాంగ్ చేశారు. మీ చిత్రంలో శ్రుతీ సోలో సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. తమిళంలో అలాంటి సంస్కృతి లేక పోవడానికి కారణం ఏమిటంటారు?

 జ: అదంతా నాకు తెలియదు. నన్ను అలా నటించమని ఎవరూ అడగలేదు. నేనూ నటించలేదు. నాకు తెలుగులో స్నేహితులు అధికం. సినిమాకు సంబంధించిన చాలా విషయాల గురించి చర్చించుకుంటాం. తమిళంలో నాకలాంటి సందర్భం కలగలే దు.

 

 ప్రశ్న: తమిళంలో మళ్లీ మీ స్థాయిని పొంద గలరని భావిస్తున్నారా?

 జ: ఆ విషయాల గురించి నేను ఆలోచించను. ఇక్కడ నేను చిరుతై చిత్రం తరువాత వీరం చిత్రంలో నటించాను. ఇప్పుడు బాహుబలితో తెరపైకి రానున్నాను. త్వరలో వాసు శరవణన్ ఒన్నా పడిచ్చవంగ చిత్రంతో రానున్నాను. కెరీర్ ప్రారంభం నుంచి అధిక చిత్రాలు చెయ్యాలనుకోవడంలేదు. మంచి కథా చిత్రం అనిపిస్తేనే చేస్తున్నాను. తెలుగు, తమిళం, హిందీ అంటూ బిజీగానే నటిస్తున్నాను. అందువల్ల తమిళంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటానా అన్న విషయం గురించి అలోచించడం లేదు. మంచి అవకాశం వస్తే చేసుకుంటూ పోతాను అంతే.

 

 ప్రశ్న:హీరోయిన్లు తెలుగులో మాత్రమే గ్లామరస్‌గా నటిస్తారు. తమిళంలోకి వచ్చేసరికి హోమ్లీగా నటిస్తారనే ప్రచారంపై మీ స్పందన?

 జ: అలాంటిదేమీ లేదు. కథకు ఏమి అవసరమో? పాత్ర స్వభావం ఏమిటో? దర్శకుడి భావాలేమిటన్న విషయాలను గ్రహించి గ్లామర్ పరిధేమిటన్నదాన్ని బట్టి నటించాల్సి ఉంటుంది. అంతే గానీ తెలుగు, తమిళం అన్న వ్యత్యాసాలు ఉండవు.

 

 ప్రశ్న:తమిళం, తెలుగులో ఏ భాషలో వైవిద్య కథా పాత్రలు లభిస్తున్నాయి?

 జ: రెండు భాషల్లోనూ మంచి పాత్రలు లభిస్తున్నాయి. నా మట్టుకు ఒకే తరహా మూస, కమర్షియల్ కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను.

 

 ప్రశ్న: మీకు సరైన పోటీ ఎవరనుకుంటున్నారు?

 జ: నిజం చెప్పాలంటే ఎక్కడైనా పోటీ అనేది ఉంటుంది. అది మనలోని ప్రతిభను ఇనుమడింపజేస్తుంది కూడా. అయితే పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి.

 

 ప్రశ్న: నటుడు కార్తీతో మళ్లీ నటిస్తున్న అనుభవం గురించి?

 జ: కార్తీతో ప్రస్తుతం చేస్తున్నది తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం. ఇన్‌టచ్‌బుల్ అనే ఫ్రెంచ్ భాషా చిత్రంలోని చిన్న లైన్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పైయ్యా, చిరుతై చిత్రాల తరువాత కార్తీతో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం. మా జంటను అభిమానులు తెరపై చూసి చాలా ఎంజాయ్ చేస్తారు.

 

 ప్రశ్న: కమల్, రజినీలతో నటించాలని కోరుకుంటున్నారా?

 జ: అవ కాశం వస్తే తప్పకుండా నటిస్తా.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top