వాళ్లిద్దరు ఒకటయ్యారు

వాళ్లిద్దరు ఒకటయ్యారు


టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం మధ్య అధిష్టానం చొరవతో సయోద్య కుదిరింది. తమ నేతలు ఏకం కావడంతో ఇక, సమష్టిగా ఐకమత్యంతో పార్టీ కోసం శ్రమించేందుకు మద్దతుదారులు  సిద్ధం అయ్యారు.

 

 సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఏ ఏ గ్రూపుల మధ్య ఎప్పుడు  వివాదాలు రాజుకుంటాయో చెప్పలేం. ఈ గ్రూపు గొడవలే ఆ పార్టీని  రాష్ర్టంలో పతనం అంచుకు చేర్చి ఉన్నాయి. ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో చతికిల బడ్డ పార్టీకి  కొత్త గాలి నింపడం లక్ష్యంగా  టీఎన్‌సీసీ బాధ్యతల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఏఐసీసీ అప్పగించింది. అయినా, గ్రూపుల తన్నులాట మాత్రం ఆగలేదు.ఈ సారి ఏకంగా  టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గీయులు ఢీ కొట్టి రచ్చకెక్కారు. దీంతో రెండు గ్రూపుల మధ్య  మాటల యుద్ధం పెరిగింది.

 

 పార్టీతో సంబంధం లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించే పనిలో చిదంబరం వర్గీయులు నిమగ్నం కావడంతో వేరు కుంపటి పెట్టబోతున్నారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ రెండు గ్రూపుల వివాదం పార్టీని మరింత అదోగతి పాలు చేస్తుండడంతో ఏఐసీసీ పెద్దలు పంచాయితీ పెట్టక తప్పలేదని చెప్పవచ్చు.  ఈ పంచాయతీలు ఓ వైపు సాగుతున్నా, మరో వైపు మాటల తూటాలు పేలుతూనే వచ్చాయి.   ఈ పరిస్థితుల్లో  అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోండడంతో ఇకనైనా సామరస్య పూర్వకంగా అందరూ కలసి మెలసి వెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. దీంతో చిదంబరం, ఈవీకేఎస్ తగ్గారు.

 

 కుదిరిన సయోధ్య :  ఇన్నాళ్లు సత్యమూర్తి భవన్‌లో ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టకుండా, హోటళ్లల్లో జరుపుకుంటూ వచ్చిన చిదంబరం మద్దతు దారులు, గత వారం ఈవీకేఎస్‌తో భేటీ కావడం  సత్యమూర్తి భవన్‌ను వేదికగా చేసుకుని సమావేశం ఏర్పాటు చేసుకోవడం వివాదాలకు ముగింపు పలికినట్టు అయింది. అదే సమయంలో   రెండు రోజుల క్రితం పార్టీ సర్వ సభ్య సమావేశం జరగడం, ఇందుకు చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం డుమ్మా కొట్టడంతో చర్చకు దారి తీశాయి. ఐక్యంగా కదులుదాం : ఇక , కాంగ్రెస్‌లో గ్రూపులకు ఆస్కారం లేదని, అందరం ఐకమత్యంగా ముందుకు సాగడం లక్ష్యంగా చిదంబరం, ఈవీకేఎస్‌లో ఒక నిర్ణయానికి వచ్చేశారు.

 

 అధిష్టానం పెద్దల పంచాయతీకి తలొగ్గిన ఈ నేతలు ఇక, తామిద్దరం కలసి కట్టుగా పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగునున్నారు.  ఆదివారం సత్యమూర్తి భవన్ వేదికగా ఈ ఇద్దరు నేతలు ఏకం అయ్యారు. డీఎండీకే నేత విజయకాంత్ ఆ ఇద్దరితో కలసి సత్యమూర్తి భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం అంబేద్కర్ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ విభాగం నేతృత్వంలో ఏడాది పాటుగా నిర్వహించే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. ఈవీకేఎస్ చిదంబరం కలసి కట్టుగానే ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను తెలుసుకుని వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.

 

 ఇందులో ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసర్, జయకుమార్, అధికార ప్రతినిధి కుష్భు, మాజీ ఎంపి కృష్ణ స్వామి, ఎస్సీ, ఎస్టీ విభాగం నేతలు సెల్వ పెరుంతొగైలతో పాటుగా పలువురు ముఖ్య నాయకులు హాజరు అయ్యారు.  ఈ సమావేశం వేదికగా తమ నేతలు ఏకం కావడంతో ఇక, సమిష్టిగా పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగేందుకు ఆ ఇద్దరు నేతల మద్దతు దారులు సిద్ధం అయ్యారు. ఈ ఐక్యత కొనసాగాలన్న కాంక్ష పలువురు సీనియర్ కాంగ్రెస్ వాదులు వ్యక్తం చేయడం గమనార్హం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top