మళ్లీ విధుల్లోకి ఎన్ కౌంటర్‌ స్పెషలిస్ట్‌

మళ్లీ విధుల్లోకి ఎన్ కౌంటర్‌ స్పెషలిస్ట్‌ - Sakshi


ముంబై: ఆ పోలీస్‌ అధికారి వయసు 55 ఏళ్లు.. పాతికేళ్ల సర్వీస్‌. 100 ఎన్‌కౌంటర్లలో 113 మంది గ్యాంగ్‌స్టర్లను ఏరివేశారు. ఇది ప్రదీప్‌ శర్మ ట్రాక్‌ రికార్డు. బాలీవుడ్ లో ఈయన కథ ప్రేరణతోనే అబ్ తక్ చప్పన్ అనే ఓ సినిమా కూడా వచ్చింది. అయితే తర్వాతే గ్యాంగ్‌స్టర్లతో చేతులు కలిపాడన్న ఆరోపణల నడుమ కొన్నాళ్లపాటు ఖాకీ చొక్కాకు దూరమయ్యారు. చివరకు వాటి నుంచి బయటపడటంతో ఇప్పుడు విధుల్లో చేరేందుకు సిద్ధమైపోతున్నారు.



మహారాష్ట్రలోని ధులే జిల్లా అగ్ర ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో ప్రదీశ్‌ శర్మ జన్మించాడు. తండ్రిలాగే తాను టీచర్‌ అవ్వాలని కలలు కన్న శర్మ చివరకు పోలీసాఫీసర్‌ అయ్యారు. 1983 మహారాష్ట్ర పోలీస్‌ సర్వీస్కు ఎంపికయ్యాడు.  మే 6, 1993లో ఏకే-56 ఆయుధాల స్పెషలిస్ట్ సుభాష్ మకద్వాలా ఎన్‌కౌంటర్‌తో ప్రదీప్‌ వేట మొదలైంది. అక్కడ నుంచి గ్యాంగ్‌స్టర్ల భరతం పట్టే పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో లష్కర్‌-ఈ-తోయిబా సానుభూతిపరులను కూడా ఆయన వదిలిపెట్టలేదు. క్రమక్రమంగా ప్రదీప్‌ శర్మ పేరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా మారిపోయింది.



ఆపై ఆయన దృష్టంతా అండర్ వరల్డ్ డాన్‌ ఛోటా రాజన్‌, దావూద్‌ ఇబ్రహీం అనుచరుల మీద పడింది. ఎన్‌కౌంటర్‌ల ద్వారా వారిని ఏరి పారేస్తూ వచ్చారు. 2000 సంవత్సరంలో తన ఇన్‌ఫార్మర్‌ ఓపీ సింగ్‌ను ఛోటా రాజన్‌ హత్య చేయటంతో ప్రదీప్‌ ఆగ్రహంతో రగిలిపోయారు. అప్పటి నుంచి రాజన్‌కు నిద్రలేకుండా చేశారు. ఛోటా రాజన్‌ అనుచరుల్ని ఒక్కొక్కరినీ హతమార్చుకుంటూ వెళ్లడంతో రాజన్‌ ఒకానొక సమయంలో కాళ్ల బేరానికి వచ్చాడు.



ఆరోపణలు.. అరెస్ట్... వేటు



2006లో లఖన్‌ భయ్యా ఎన్‌కౌంటర్ కావటం, అందులో దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్కు ప్రదీప్‌ శర్మ సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో ఆయనపై వేటు పడింది. ముందు కంట్రోల్‌ రూం నుంచి ధారావి స్టేషన్కు ట్రాన్స్‌ఫర్‌ చేసిన ప్రభుత్వం 2008లో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా 2010లో ఈ ఫేక్‌ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి 21 మంది పోలీసాఫీసర్లను అరెస్ట్ చేయగా, వారిలో ప్రదీప్‌ శర్మ కూడా ఉన్నారు.



అయితే 13 మంది అధికారులను జూలై 2013 లో ముంబై స్పెషల్‌ కోర్టు దోషులుగా ప్రకటించగా, శర్మ మాత్రం నిర్దోషిగా రిలీజ్‌ అయ్యారు. కానీ, కేసులో ఆయన పాత్రపై ఇంకా హైకోర్టులో కేసు నడుస్తుండటతో పునర్నియామకంపై పోలీస్‌ శాఖ వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో వచ్చే వారం ఆయన థానే పోలీస్‌ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రదీప్‌ శర్మ పదవీకాలం 2018తో ముగియనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు కూడా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌ను గతేడాది ఇదే రీతిలో తిరిగి విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top