నవీముంబైకి ఎలక్ట్రిక్ బస్సులు


సాక్షి, ముంబై: నవీ ముంబై ప్రయాణికులకు ఇక మీదట ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం దక్కనుంది. నవీ ముంబై మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ (ఎన్‌ఎంఎంటీ)... జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) పథకంలో భాగంగా ఐదు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది. మరో రెండు నెలల్లో ఈ ఏసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. రవాణా విభాగం బస్సులను కొనుగోలు చేసి వీటి సామర్ధ్యాన్ని పరీక్షించేందుకు ప్రయోగాత్మకంగా నడపనున్నారు. ఈ బస్సులను ఫిన్‌లాండ్‌కు చెందిన ఉత్పత్తిదారుల నుంచి దిగుమతి చేసుకోనున్నారు.



హెచ్‌ఎంటీడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కోచ్‌లను ఉత్పత్తి చేయనుంది. అయితే ఈ బస్సులు డీజిల్ ద్వారా ఎలక్ట్రిక్ జనరేటర్‌పై నడవనున్నాయని అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంఎంటీ చైర్మన్ గణేష్ మాత్రే మాట్లాడుతూ.. రవాణా విభాగం కాలుష్య రహిత రవాణా వ్యవస్థపై ప్రయోగాలు నిర్వహిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా ఈ కోవకు చెందిన బస్సులను నగర రోడ్లపై ప్రయోగాత్మకంగా నడిపి వాటి సామర్థ్యం తెలుసుకోనున్నట్లు వివరించారు. తమ సంస్థ వద్ద ఇప్పటికే 50 వోల్వో బస్సులు ఉన్నాయన్నారు. సామర్థ్యంలో పోలిస్తే వోల్వో బస్సుల కంటే ఈ కొత్తబస్సులు సమర్థవంతమైన ఇంధన శక్తిని కలిగి ఉంటాయని చెప్పారు.



ఇటీవల రవాణా విభాగం టాటా మోటర్స్ నుంచి హైబ్రిడ్ బస్సులను కొనుగోలు చేసేందుకు యోచించింది. హెచ్‌ఎంటీడీ బస్సుల కన్నా ఈ బస్సులకు నిర్వహణ ఖర్చులు అధికంగా అవుతాయని భావించింది. దీంతో ఎన్‌ఎంఎంటీ ఈ బస్సులను ఎంచుకుంది. కాగా, హెచ్‌ఎంటీడీ నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.16 లక్షలు కాగా, టాటా మోటార్స్‌కు ఇదే కాలానికి రూ.49 లక్షలు అవుతోందని మాత్రే తెలిపారు. వోల్వో బస్సులు లీటర్‌కు కేవలం రెండు కిలో మీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుండగా ఈ హైబ్రిడ్ ఎలక్రిక్ బస్సు లీటర్‌కు ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందన్నారు.



ధర విషయానికి వస్తే.. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సు ధర సుమారు రూ.2 కోట్ల 41 లక్షలు కాగా టాటా మోటర్స్ బస్సు రూ.ఒక కోటి 67 లక్షల ధర  ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎన్‌ఎంఎంటీ 370 బస్సులను నడుపుతోంది. ఇందులో 145 బస్సులు సీఎన్‌జీతో నడుస్తుండగా, 30 బస్సులు ఎయిర్ కండీషన్డ్ వోల్వో బస్సులు ఉన్నాయి. ఇటీవల మరో 40 కొత్త వోల్వో బస్సులను కొనుగోలు చేసింది. ఏడాదిలోగా మరో 115 బస్సులను కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించినట్లు మాత్రే వివరించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top