ఎనిమిది వారాలు గడువు


పాలికె ఎన్నికల నిర్వహణపై సుప్రీం తీర్పు

 

బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికల నిర్వహణకు మరో ఎనిమిది వారాల పాటు గడువునిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో ఈనెల 28న జరగాల్సిన బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వెనక్కు వెళ్లనుంది. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పు ప్రతి తమకు అందినతర్వాతే ఈ విషయంపై మాట్లాడగలనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచార్ తెలిపారు. వివరాలు... ఆగస్టు 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న సుప్రీం తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించడమే కాకుండా ప్రభుత్వానికి రూ.10వేల అపరాధ రుసుం విధించిన విషయం విషయం తెలిసిందే. అయితే హైకోర్టును తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈకేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. వాదనల్లో భాగంగా  బీబీఎంపీ వార్డులను పునఃవిభజన చేయడంతో పాటు నూతనంగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల ఎన్నికల నిర్వహణకు కనీసం మరో మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.



రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరపున వాదనలు వినిపించిన ఫణీంద్ర....‘ప్రస్తుత తరుణంలో వార్డుల పునఃవిభజ చేయడం వల్ల ఓటర్ల జాబితాను మార్చాల్సి వస్తుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా వార్డుల రిజర్వేషన్ల జాబితా అధికారికంగా ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు అందజేసింది.  మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. అందువల్ల రిజర్వేషన్ జాబితా మార్చడానికి కాని, ఎన్నికల వాయిదా వేయడం కాని సరికాదు.’ అని వివరించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయపీఠం బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను ముగించడానికి మరో ఎనిమిది వారాల పాటు గడువు ఇస్తూ తీర్పు చెప్పింది.



 కాగా, ఈ విషయమై ఫణీంద్ర మాట్లాడుతూ...తాజా తీర్పు వల్ల వార్డుల పునఃవిభజనకు అవకాశం కలగదు. అంతేకాకుండా రిజర్వేషన్ల జాబితాలో ఎటువంటి మార్పు ఉండదన్నారు.అయితే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎనిమిది వారాలు వెనక్కు వెళ్లేఅవకాశం ఉందన్నారు. ఈ ఎనిమిది వారాల వాయిదా  నేటి (శుక్రవారం) నుంచి అన్వయిస్తుందా లేదా ఆగస్టు 5 నుంచి అన్వయిస్తుందా అనే విషయంపై  తీర్పు ప్రతి అందిన తర్వాత స్పష్టత వస్తుంది.’ అని వివరించారు. ఇదిలా ఉండగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ శ్రీనివాచార్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత పరిశీలించి న్యాయనిపుణులతో చర్చించి నూతన ఎన్నికల షెడ్యూల్ వెళ్లడించడం పై అధికారిక ప్రకటన చేస్తానన్నారు. ఇదిలా ఉండగా సుప్రీం తీర్పు వల్ల గతంలో వలే ఆగస్టు 5 లోపు కాకుండా అక్టోబర్ 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.  

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top