ఏక్షణంలోనైనా ప్రభుత్వం పడిపోవచ్చు !

ఏక్షణంలోనైనా   ప్రభుత్వం పడిపోవచ్చు ! - Sakshi


= మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు

కాంగ్రెస్‌లో సిద్ధూ మాట ఎవరూ ఖాతరు చేయడం లేదు

కర్ణాటక ముక్త కాంగ్రెస్‌ను ఆ పార్టీ నేతలే చేసుకుంటున్నారు


జీఎస్‌టీ బిల్లుకు వచ్చే లోక్‌సభ సమావేశాల్లో ఆమోదం

కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ


 


బళ్లారి (గుల్బర్గా) : రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తుంటే ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానందగౌడ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గుల్బర్గాలో అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సిద్దరామయ్య మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత అసమ్మతి పెరిగిపోయిందన్నారు. దీంతో ఏకంగా సీఎం కుర్చీ కదిలే పరిస్థితే కాకుండా మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను పూర్తిగా లేకుండా చేయడానికి బీజేపీ కాంగ్రెస్ ముక్త కర్ణాటక చేయాలని ప్రయత్నం చేస్తోందని, అయితే తాము చేయాల్సిన పనిని కాంగ్రెస్ పార్టీ నేతలే చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని వారు, మంత్రి వర్గం నుంచి తొలగించిన వారు కలిసికట్టుగా యుద్ధం ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం పూర్తిగా నిద్రావస్థలో ఉందని, దీంతో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అవినీతి పరులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించిన సిద్దరామయ్య మరింత ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించి, అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులకే పట్టం కట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే అస్తవ్యస్తంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి మాటను ఏ మంత్రులు ఖాతరు చేయడం లేదన్నారు.


 

అధికారులు, మంత్రుల మధ్యనే సమన్వయం లేదని గుర్తు చేశారు. దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. వచ్చే లోక్‌సభ సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లుకు ఆమోద ముద్ర లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నాయని, అయితే తమిళనాడులో ఓ లోక్‌సభ మెంబరు కొంత వ్యతిరేకత వ్యక్తపరిచారని, అయితే ఆ సమస్యను కూడా అధిగమిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


 


 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top