మేము రెడీ.. మరి వాళ్లో!

మేము రెడీ.. మరి వాళ్లో!


 సాక్షి, చెన్నై: అధికారంలోకి రాగానే, తమ వాళ్లకు చెందిన మద్యం తయారీ పరిశ్రమలన్నీ మూత వేయడానికి సిద్ధమయ్యామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి అంటున్నారు. ఇది, తానొక్కదాన్నే చెప్పడం లేదని, ఆయా సంస్థలకు చెందిన వాళ్లూ రెడీ అయ్యారని వ్యాఖ్యానిస్తూ, మరి మిడాస్‌కు తాళం ఎప్పుడు పడుతుందో అని ప్రశ్నించారు. రాష్ర్టంలో సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో అన్ని పార్టీలు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో డీఎంకే కూడా ఉంది. అన్నాడీఎంకే మాత్రం దశల వారీ అన్న నినాదాన్ని ప్రకటించి ఉన్నది. డీఎంకే అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయించి, ప్రజల్లోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లే పనిలో పడ్డారు.

 

 అయితే, డిఎంకేకు చెందిన నాయకులు అన్నాడీఎంకే వర్గాలపై, అన్నాడీఎంకే నాయకులు డీఎంకే వర్గాలకు సవాళ్లు విసురుతూ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం, అధికారంలోకి రాగానే తమ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అని డీఎంకే నినాదం అందుకోగా, మరీ తమరెప్పుడు అంటూ అన్నాడీఎంకే మద్యం ఫ్యాక్టరీ యజామానుల్ని ప్రశ్నించే పనిలో పడ్డారు. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి  మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే తమ వాళ్లందరూ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మాట అన్నది తాను మాత్రమే కాదు అని, సంబంధిత వ్యక్తులు కూడా స్పష్టం చేసి ఉన్నారన్నారు.

 

 అయితే, తాము రెడీ అయ్యామని, అలాంటప్పుడు వాళ్లకు చెందిన ‘మిడాస్’  ఎప్పుడు మూసి వేయబోతున్నారో ప్రశ్నించడంటూ మీడియాకు సూచించారు. అన్నాడీఎంకే వర్గాలకు చెందిన మిడాస్‌లో అనేక బ్రాండ్ల మద్యం తయారు అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు మద్యం సరఫరా అవుతున్నది. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న మిడాస్‌ను ఎప్పుడు మూస్తారో అంటూ కనిమొళి ప్రశ్నించడం విశేషం. అయితే, డీఎంకే అధికారంలో వస్తే, సర్వాధికారాలు వారి చేతికి వచ్చినట్టే.  అలాంటప్పుడు ‘మిడాస్’ను మూయించ లేరా..?, మరీ, వాళ్లే ఎందుకు తాళం వేసుకోవాలో..? అని పెదవి విప్పే వాళ్లే అధికం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top