కెప్టెన్ ఎవరికో?

కెప్టెన్ ఎవరికో? - Sakshi


చెన్నై: డీఎండీకే ఓటు బ్యాంక్ ఎవరికి దక్కనుందో అన్న చర్చ రాష్ట్రంలో బయలుదేరింది. బీజేపీ వెంట నడిచేనా, లేదా, డీఎంకేతో దోస్తీ కట్టేనా అన్న ఉత్కంఠ  నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయకాంత్‌తో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎండీకే ఆవిర్భావంతో తానొక్కడినే అసెంబ్లీలో అడుగు పెట్టినా, తన కంటూ ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్న నేత విజయకాంత్. ఆ ఓటు బ్యాంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేర్పించింది.

 

 లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా, తన ఓటు బ్యాంక్ మాత్రం పదిలంగా ఉండటం విజయకాంత్‌కు ఓ వరం. అదే ఇప్పుడు ఆయన చుట్టూ ప్రధాన పార్టీ డిఎంకే, జాతీయ పార్టీ బీజేపీని తిప్పించుకునేలా చేస్తున్నది. డిఎంకే, కాంగ్రెస్‌ల బంధం మళ్లీ వికసించడంతో, విజయకాంత్ పయనం ఎటో అన్న ప్రశ్న ఓ వైపు ఉన్నా, విజయకాంత్ ఓటు బ్యాంక్ దక్కేది  ఎవరికో అన్న చర్చ మరో వైపు తెర మీదకు వచ్చి ఉన్నది. డీఎండీకేను తమ వైపుకు తిప్పుకునేందుకు డీఎంకే ఓ వైపు, బీజేపీ మరో వైపు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా, ఎక్కడా విజయకాంత్ చిక్కడం లేదు. తన రూటే సపరేటు అన్నట్టుగా ముందుకు సాగుతూ వస్తున్నారు.

 

 ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ఆయన డీఎంకే వెంట వెళ్లొచ్చన్నట్టుగా మెజారిటీ శాతం అభిప్రాయం వ్యక్తం అవుతున్నా, సీఎం కుర్చి ఎక్కాలన్న ఆశతో ఉన్న ఈ కెప్టెన్ చివరి క్షణంలో ఎలా వ్యవహరిస్తారో అన్నది ఆ పార్టీ వర్గాలకే అంతు చిక్కడం లేదు. దీంతో కెప్టన్ ఎటో అన్న  ఉత్కంఠ ఆ పార్టీలోనే కాదు, డీఎంకే, బీజేపీ వర్గాల్లోను పెరిగింది. ఇప్పటికే పొత్తు బేరసారాల్లో విసిగి వేసారి ఒంటరి సమరానికి మానసికంగా సిద్ధం అవుతోన్న బీజేపీ, చివరి చాన్స్‌గా విజయకాంత్ వద్దకు మళ్లీ మంతనాల ప్రయత్నంలో పడ్డట్టుంది.

 

ఇందుకు తగ్గట్టుగానే శనివారం తమిళి సై సౌందరరాజన్ విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇంటి మెట్లు ఎక్కారు. రాజకీయ అంశాలపై చర్చ ఈ సమయంలో సాగినట్టు సమాచారం. ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యం నెలకొన్నప్పటికీ, ఇది కుటుంబ కార్యక్రమానికి ఆహ్వానం మాత్రమేనని, పొత్తు యత్నాలు ఢిల్లీ పెద్దలు చూసుకుంటారంటూ తమిళిసై వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే,తన కుమారుడు సుగనాథన్ వివాహానికి హాజరు కావాలంటూ సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధితోపాటు వివిధ పార్టీల నాయకుల్ని తమిళిసై కలుస్తూ, ఆహ్వాన పత్రికలు అందిస్తున్న విషయం తెలిసిందే.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top