పనికొచ్చే ప్రశ్నలు వేయండి

పనికొచ్చే ప్రశ్నలు వేయండి - Sakshi


సాక్షి, చెన్నై : ప్రజల్లోకి వచ్చిన మరుసటి రోజే డీఎండీకే అధినేత విజయకాంత్‌ టెన్షన్‌కు గురయ్యారు. తన ధోరణి ఇంతే అని నిరూపించుకుంటూ మీడియా ముందు శివాలెత్తారు. ఏందీ..అమ్మమ్మా...అంటూ  కోపం వచ్చేస్తుంది..వస్తే అంతే అంటూ విరుచుకు పడ్డారు. తదుపరి త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.రెండు నెలలకు పైగా డీఎండీకే అధినేత విజయకాంత్‌ అనారోగ్యంతో ఇం టికి, ఆస్పత్రికి పరిమితమైన విష యం తెలిసిందే. శని వారం శివగంగైలో పర్యటించిన ఆయన తాను ఆరోగ్య వంతుడినయ్యానని చాటుకున్నారు. ప్రజలతో ఇక మమేకం అని ప్రకటించుకుని , రెండో రోజు ఆదివారం తిరునల్వేలిలో పర్యటించారు.

అయితే,  ఆయన ధోరణిలో మాత్రం ఎలాంటి మార్పులేదు. మరింత దూకుడుతో ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం.



కెప్టెన్‌ టెన్షన్‌ : డీఎండీకే నాయకుడి ఇంటి శుభకార్య వేడుకకు సతీమణి ప్రేమలతతో కలిసి హాజరై విజయకాంత్‌ను మీడియా వర్గాలు చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో తనలో కొంత కాలంగా నిద్రపోతున్న ఆవేశాన్ని బయటకు తీశారు. అన్నాడీఎంకే గురించి సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఓపీఎస్‌ చెప్పాడంటా... అమ్మ.. అమ్మ మ్మా... ఏందీ అమ్మమ్మా...నాకు కోపం వచ్చిం దో... అంటూ నాలుక మడత పెట్టి మరీ ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో మీడియా వర్గాలు అవాక్కయ్యారు.



 అన్నాడీఎంకేలోని శిబిరాల గురించి ప్రస్తావించగా, ఓపీఎస్‌(పన్నీరు), ఈపీఎస్‌(ఎడపాడి పళనిస్వామి) ఇద్దరూ వేస్ట్‌.., తన వద్ద ఆ ఇద్దరి ప్రస్తావన వద్దే వద్దంటూ మళ్లీ తన ఆక్రోశాన్ని ప్రదర్శించారు. అమ్మ సమాధి వద్ద కూర్చున్నాడంటా...నీ...అంటూ మళ్లీ కోపం వచ్చేస్తుందంటూ ఆ ప్రశ్నకు సమాధానం దాట వేశారు. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం, చిదంబరం ఇంట్లో ఐటీ దాడుల ప్రస్తావన తీసుకురాగా,  ఉపయోకరంగా, ప్రజలకు మంచి అనిపించే ప్రశ్నలను వేస్తే సమాధానాలు ఇస్తానని, లేదంటే వెళ్లి పోతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌కు వ్యతిరేకత బయలు దేరి ఉందే అని ప్రశ్నించగా, అవన్నీ సహజం అని, తనుకూ వ్యతిరేకత తప్పలేదు..ఇప్పుడు రాజకీయాల్లో ఏ స్థాయికి చేరానో చూసుకోండంటూ వ్యాఖ్యలు చేశారు.



 రజనీకాంత్‌ తనకు మంచి మిత్రుడు...అంతే అని స్పందించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం సిద్ధం కావాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ ఎన్నికలకు ముందే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. చివరగా ఈవీఎంలలో ఎలాంటి మోసాలు, అవకతవకలు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top