దినకరన్‌ దారెటు!

దినకరన్‌ దారెటు!


► 34 మంది ఎమ్మెల్యేలతో మంతనాలు

► రాష్ట్రపతి ఎన్నికలపై తర్జనభర్జన

► అన్నాడీఎంకేలో మూడో వర్గం




చెన్నై: అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్ధికే ఓటు వేయాలని తీర్మానించిన విషయం తెలిసిందే. మూడో వర్గం నేత దినకరన్‌ ఎవరికి తన మద్దతును ఇస్తాడనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. దినకరన్‌ వైపున్న 34 మంది ఎమ్మెల్యేలు ఎడపాడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడం ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారింది.



బీజేపీ పట్ల మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఎన్‌డీఏ అభ్యర్థికే తమ మద్దతను ప్రకటించారు. కొన్నినెలలు దూరంగా మెలిగి అనేక రాజకీయ పరిణామాల తరువాత కేంద్రం వద్ద సాగిలపడిన సీఎం ఎడపాడి సైతం ఎన్‌డీఏ అభ్యర్థికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో ఇక మిగిలింది టీటీవీ దినకరన్‌ మాత్రమే. అయితే ఎడపాడి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని దినకరన్‌ వర్గీయులైన 34 మంది ఎమ్మెల్యేలు బలపరిచారా అనేది స్పష్టం కాలేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలో శశికళ నిర్ణయిస్తారని ఈ 34 మంది ప్రచారం చేస్తున్నారు.



సీఎం ఎడపాడి తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు శశికళ అనుమతి తీసుకున్నారా అని దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలు తంగతమిళ్‌సెల్వన్, వెట్రివేల్‌ వ్యాఖ్యానించి తమ అసంతృప్తిని ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో శశికళ ఆదేశాలను శిరసావహిస్తానని ఎమ్మెల్యే, నటుడు కరుణాస్‌ గురువారం వ్యాఖ్యానించడంతోపాటు దినకరన్‌ను కలుసుకున్నారు. దినకరన్‌కు పిలుపులేకపోవడంతో సీఎం ఎడపాడి ఇచ్చిన ఇఫ్తార్‌ విందును ఈ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను రెండు రోజుల క్రితం కలిసిన పార్లమెంటు ఉప సభాపతి తంబిదురైతో సీనియర్‌ మంత్రులు తంగమణి, వేలుమణి గురువారం ఉదయం సమావేశమయ్యారు.



పార్టీకి తనను దూరం చేసిన ఎడపాడి అంటే ఏ మాత్రం గిట్టని దినకరన్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని విబేధించాలని భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీని నిర్ణయాన్ని దిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేసే పరిస్థితి లేదని వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్‌ వ్యాఖ్యానించినట్లుగా దినకరన్‌ ఆ సాహసం చేయకపోవచ్చు. అలాగని ఎడపాడి, పన్నీర్‌ సెల్వం బాటలోనే పయనిస్తే విబేధాలకు అర్థమేలేదని అలోచిస్తున్నారు.



ఎన్‌డీఏ అభ్యర్థికే ఓపీఎస్‌ మద్దతు:

ఎన్‌డీఎ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కే తమ మద్దతని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటువేయాలనే ఏకైక అజెండాతో అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ వర్గం నేతలతో పన్నీర్‌సెల్వం గురువారం సమావేశమయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు ప్రకటించారు. ప్రధానిని కలిసి ఈ నిర్ణయాన్ని తెలియజేసేందుకు పన్నీర్‌సెల్వం గురువారం ఢిల్లీకి వెళ్లారు.



ఢిల్లీకి సీఎం:

అన్నాడీఎంకే (అమ్మ) బలపరుస్తున్న ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ను అభినందించేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రత్యేక విమానంలో గురువారం ఢిల్లీ వెళ్లారు. సీఎంతోపాటూ కొందరు మంత్రులు, పార్టీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. రామ్‌నాథ్‌ను కలవగానే గురువారం రాత్రే సీఎం తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.



 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top