ఆచరణాత్మక బడ్జెట్: ముఖ్యమంత్రి ఫడ్నవీస్


ఎంయూటీపీ-3కి రూ. 11,500 కోట్ల కేటాయింపుపై హర్షం

ముంబై: కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆచరణాత్మకమైందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సాంకేతిక ఆధారిత ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తూ రైల్వేలో పునరుజ్జీవనం నింపేందుకు కృషిచేస్తున్న ప్రధాని మోడీ, రైల్వే మంత్రి సురేశ్ ప్రభులకు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ ప్రగతీ శీలమని, ఆచరణయోగ్యమని వర్ణించారు. ఎంయూటీపీ 3 కోసం రూ. 11, 500 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు.



బడ్జెట్‌పై శివసేన వ్యాఖ్యలకు సీఎం స్పందిస్తూ... బహుశా వారు బడ్జెట్‌ను సరిగా విని ఉండరు అని అన్నారు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ మాత్రం సామాన్యులకు, ముఖ్యంగా ముంబై, మహారాష్ట్రకు ఏమాత్రం బడ్జెట్  ఉపయోగకరం కాదని విమర్శించాయి. చార్జీలు పెంచబోమన్న ప్రభు వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత మానిక్‌రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, రవాణా చార్జీలను 6.2 శాతం, ముంబై సబర్జన్ చార్జీలు 200 శాతం పెంచిందని విమర్శించారు.



గత కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో బడ్జెట్‌లో చార్జీలు తగ్గిస్తారని ఆశించామని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాలను కలిపేలా ఏర్పాటు చేయాలన్న రైల్వే లైన్ల నిర్మాణల ప్రస్తావనే తేలేదని విమర్శించారు. కాగా, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ... ముంబైలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ, మల్టీనోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్ ఏర్పాటు చేస్తానన్న ప్రభు..తన మాట నిలబె ట్టుకోలేదని విమర్శించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top