పలు పాఠశాలల్లో భద్రతా చర్యలు

పలు పాఠశాలల్లో భద్రతా చర్యలు - Sakshi


పెషావర్ ఘటన ప్రభావం

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్‌లోగల పాఠశాలలో తాలిబన్ రక్తపిశాచుల మారణకాండ నేపథ్యంలో నగరంలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు తగు భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విషయమై లక్ష్మణ్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాం మాట్లాడుతూ తమ పాఠశాలకు సమీపంలోనే మెట్రో రైల్వేస్టేషన్ ఉందన్నారు. ఇందువల్ల ఎవరైనా తమ పాఠ శాల వద్దకు సులువుగా చేరుకునేందుకు వీలవుతుందన్నారు. ఇలా ఉండడం తనకు ఎంతో అసౌకర్యంగా అనిపిస్తోందన్నారు.



అందువల్ల తమ పాఠశాల ప్రహరీగోడ ఎత్తును పెంచాలని నిర్ణయించామన్నారు. దీంతోపాటు భద్రతా చర్యల్లో భాగంగా లంచ్ బాక్సులను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించామన్నారు. దీంతోపాటు పాఠశాల ప్రాంగణమంతటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కాగా పెషావర్ ఘటన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ పాఠశాలల యాజమాన్యాలకు కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది.



ఇదిలాఉంచితే సాధారణంగా పాఠశాలల్లోకి లంచ్ బాక్సులను అనుమతిస్తారు. అయితే పెషావర్ ఘటన నేపథ్యంలో ఇకపై పాఠశాలకు తీసుకొచ్చే ప్రతి వస్తువునూ తనిఖీ చేయనున్నారు. ఇదే విషయమై మరో పాఠశాల ప్రిన్సిపాల్ నీనా మాట్లాడుతూ ‘ఒకసారి విద్యార్థి బడిలోకి అడుగుపెట్టిన తర్వాత ఎటువంటివాటినీ లోపలికి అనుమతించబోం. ఒకవేళ విద్యార్థులు ఎవరయినా భోజనం మరిచిపోయి వస్తే వారికి డబ్బులు ఇచ్చి క్యాంటీన్‌కు పంపుతాం. ముందస్తు అప్పాయింట్‌మెంట్ లేకుండా పిల్లల తల్లిదండ్రులను బడిలోకి రానివ్వం’అని తెలిపారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top