కోర్టు దారి ఎటో?

కోర్టు దారి ఎటో?


► నగర, గ్రామీణ పరిధిలోకి రహదారులు

► టాస్మాక్‌ల కోసం స్థాయి తగ్గింపు

► కోర్టుకు వ్యవహారం

► వాడివేడిగా వాదనలు




సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రెండు వేల కిమీ దూరం మేరకు  జాతీయ, రాష్ట్ర రహదారులు నగర, గ్రామీణ రోడ్లుగా మారనున్నాయి. టాస్మాక్‌ మద్యం దుకాణాల ఏర్పాటు లక్ష్యంగా రోడ్ల స్థాయిని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వ్యవహారం కోర్టుకు చేరడంతో మంగళవారం వాదనలు వాడివేడిగా సాగాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని టాస్మాక్‌ మద్యం దుకాణాల్ని తొలగించాల్సిందేని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో రాష్ట్రంలో మూడు వేలకు పైగా దుకాణాలు మూత పడ్డాయి. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. మరో చోటకు  దుకాణాల్ని మార్చే ప్రయత్నాలు సాగుతున్నా, ప్రజల్లో బయలు దేరిన వ్యతిరేకతతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి.


జాతీయ, రాష్ట్ర రహదారుల్లో మాత్రమే దుకాణాలు ఉండ కూడదంటూ కోర్టు ఆదేశించిన దృష్ట్యా, తమ అధికారాల్ని ప్రయోగించి ఆ రహదారుల్ని గ్రామీణ, నగర రోడ్లుగా మార్చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు తగ్గ ఉత్తర్వుల స్థానిక సంస్థలకు ఇటీవల జారీ అయ్యాయి. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సిద్ధమైంది. డీఎంకే కోర్టును ఆశ్రయించేలోపు తమ పనితనాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగమేఘాలపై స్థానిక సంస్థల నుంచి వివరాలను సేకరించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు ఏఏ గ్రామాలు, నగర పరిధిలో ఎన్ని కిలోమీటర్ల  దూరం మేరకు ఉన్నాయో వివరాలను సేకరించి. అందుకు తగ్గ కార్యచరణను వేగవంతం చేశారు.


మంగళవారం సీఎం కే పళనిస్వామి నేతృత్వంలో మంత్రులు తంగమణి, వేలుమణి, జయకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, రెవెన్యూ, మార్కెటింగ్, నగర, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులతో కూడిన సమావేశంలో ఈ చర్చ సాగింది.మొత్తంగా 2వేల కిమీ దూరం మేరకు ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్ని  ఇక, స్థానిక సంస్థల పరిధిలోకి  తీసుకొచ్చేందుకు నిర్ణయించారు.



రెండు వేల కిమీ దూరం : రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో, నగర, మహానగర,  పట్టణ, గ్రామ పంచాయతీల మీదుగా 2,193 కీ.మీ దూరం మేరకు రాష్ట్ర, జాతీయ రహదారులు సాగుతున్నట్టు తేల్చారు. ఆయా గ్రామాలు, నగరాల పరిధి, సరిహద్దుల ఆధారంగా ఈ వివరాలను సేకరించారు. ఈ రోడ్ల అభివృద్ధికి రహదారుల శాఖతో పాటు స్థానిక సంస్థలు నిధుల్ని కేటాయిస్తూ వస్తున్నాయి. ఇక, ఆయా సంస్థల పరిధిలోని రోడ్ల అభివృద్ధికి ఆయా స్థానిక సంస్థల నిధులు వెచ్చించబోతున్నారు.


రహదారుల్ని స్థానిక సంస్థల  పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఇది వరకు ఉన్న చోట్లే టాస్మాక్‌ మద్యం దుకాణాలను మళ్లీ పునర్‌ ప్రారంభించుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తుండడం గమనార్హం. ఆ మేరకు రాజధాని నగరం చెన్నైలోని అన్నా సాలై, పూందమల్లి హైరోడ్డు, జవహర్‌లాల్‌రోడ్డు, పరింగి మలై – పూందమల్లి రోడ్డు, పల్లావరం –తురైపాక్కం వంటి రాష్ట్ర రహదారులను కార్పొరేషన్‌ రోడ్డులుగా మార్చేయనున్నారు. నగరం పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఇది వరకు కార్పొరేషన్‌ రూ. 550 కోట్లు కేటాయిస్తుండగా, రహదారుల శాఖ కేవలం 120 కోట్లు  అప్పగించేది.


కార్పొరేషన్‌ అత్యధికంగా నిధుల్ని వెచ్చిస్తున్న దృష్ట్యా, ఇక ఆ రహదారులు నగర రోడ్లుగా మార్చేయనున్నారు.  ఈ దిశగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 562 కీ.మీ దూరం మేరకు ఉన్న రహదారులు, నగరæ రోడ్లు గా మార్చేందుకు నిర్ణయించడం గమనించాల్సిన విష యం. ఇక, కొన్ని చోట్ల విస్తరణలో ఉన్న రహదారుల్ని సైతం స్థానిక సంస్థల పరి ధిలోకి తీసుకొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.



కోర్టుకు వ్యవహారం: ప్రభుత్వం వేగం పెంచిన దృష్ట్యా, డిఎంకే కోర్టు తలుపుల్ని తట్టింది. డిఎంకే ఎంపి ఆర్‌ఎస్‌ భారతీ, న్యాయవాది బాలుల నేతృత్వంలో మంగళవారం రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందరేష్‌లతో కూడిన బెంచ్‌ ముందు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు విల్సన్, ఎల్‌ఎస్‌ రాజాలు వాదనలు వినిపించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్ని గ్రామీణ, నగర రోడ్లుగా మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు.


సుప్రీం కోర్టును బురిడీ కొట్టించి, టాస్మాక్‌ మద్యం దుకాణాల ఏర్పాటు లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫుడ్వకేట్‌ జనరల్‌ ముత్తుకుమార స్వామి హాజరై, ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల పరిధిలోని స్థానిక సంస్థల్లో కింద ఉన్న ఈ రోడ్లను  విస్తరణ, అభివృద్ధిలో భాగంగా కేంద్రం జాతీయ రహదారులుగా, కొత్త నిబంధనల మేరకు రాష్ట్ర రహదారులుగా మార్చారని వివరించారు. ఆయా స్థానిక  సంస్థల పరిధిలో ఉన్న రహదారులు మాత్రమే రోడ్లుగా మారనున్నాయన్న విషయాన్ని  పరిగణించాలని సూచించారు. ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని, తొసి పుచ్చాలని పట్టుబట్టారు. అత్యవసర పిటిషన్‌లు కావడంతో బుధవారం నుంచి విచారణ వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top