మండలి ఎన్నికలు ఏకగ్రీవం


సాక్షి, ముంబై: విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికల్లో వీరికి పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. మండలి ఉప ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు 20వ తేదీతో ముగిసింది.



చివరి రోజు మంగళవారం శివసేనకు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, శివ్‌సంగ్రాం అధ్యక్షుడు వినాయక్ మేటే, రాష్ట్రీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు మహాదేవ్ జాన్ కర్, బీజేపీ మహిళా ఆఘాడి అధ్యక్షురాలు స్మితా వాఘ్ నామినేషన్లు వేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు నలుగురే నామినేషన్ వేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది.



ఎమ్మెల్సీలుగా ప్రాతినిథ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే, బీజేపీకి చెందిన ఆశీష్ శేలార్‌లు ఇటీవల శాసనసభకు ఎన్నికయ్యారు. వీరంతా 2014 అక్టోబరు 20వ తేదీనే తమ విధాన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.

 

అదేవిధంగా ఎన్సీపీలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వినాయక్ మేటే సభ్యత్వం రద్దయింది. ఇలా మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. పృథ్వీరాజ్ చవాన్, వినాయక్ మేటేల పదవీ కాలం 2016 జూలై ఏడో తేదీ వరకు ఉంది. అలాగే ఖాళీ అయిన ఆశీష్ శేలార్ స్థానం గడువు 2018 జూలై 27 వరకు, వినోద్ తావ్డే స్థానం గడువు 2020 ఏప్రిల్ 24 వరకు ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top