బూట్ల కోసం ఆశపడి అడ్డంగా బుక్కైన పోలీసులు

బూట్ల కోసం ఆశపడి అడ్డంగా బుక్కైన పోలీసులు


ఆగ్రా పట్టణం.. మిట్టమధ్యాహ్నం.. రద్దీగా ఉన్న ఓ షూ షోరూమ్లోకి చేతులకు సంకెళ్లతో ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతడి వెనుకే సాయుధులైన 12 మంది పోలీసులూ వచ్చారు. దర్జాగా సోఫాలో కూర్చున్న ఆ సంకెళ్ల వ్యక్తి.. పోలీసులందరికీ ఖరీదైన షూ చూపించమని సేల్స్బాయ్ని ఆదేశించాడు.



షోరూమ్ ఓనర్కు ఇదంతా వింతగా అనిపించింది. సంకెళ్లతో ఉన్న ఖైదీ.. పోలీసులకు బూట్లు కొనివ్వమేమిటనే ఆశ్యర్యంలోనే తనకు పరిచయమున్న మీడియా మిత్రులకు ఫోన్ చేశాడు. చేతిలో కెమెరాలతో ఒక్కో విలేకరి అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన పోలీసులు మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు.



తర్వాత తెలిసిన సంగతేమంటే పోలీసులకు బూట్లు ఇప్పించిన ఆ నిందితుడు సాదాసీదా నేరస్తుడుకాదు.. కరడుగట్టిన దొంగ, హంతకుడు. పేరు మనోజ్ బక్కర్ వాలా. ఇతడిపై 10 రాష్ట్రాల్లో  దాదాపు 300 వందలకుపైగా కేసులున్నాయి. ఖరీదైన కార్లు దొంగిలిస్తూ విలాసాలకు అలవాటుపడ్డ బక్కర్ వాలా.. 2010లో తన గర్ల్ ఫ్రెండ్ భర్త కుటుంబాన్ని అతి దారుణంగా చంపేశాడు.



2012లో అరెస్టయిన తర్వాత మూడు సార్లు జైలు నుంచి పరారయ్యాడు. అలాంటి నేరస్తుడి నుంచి బూట్లు తీసుకోవడం ఒక తప్పైతే, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం శిక్షార్హం. అందుకే మొత్తానికి మొత్తం 12 మంది పోలీసుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఢిల్లీ, ఆగ్రా ఎస్పీలు ప్రకటించారు.



ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటోన్న మనోజ్ బక్కర్వాలాను ఓ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం ఆగ్రా కోర్టుకు తీసుకెళ్లారు. ఢిల్లీకి చెందిన ఆరుగురు సాయుధ పోలీసులు, ఆగ్రాకు చెందిన మరో ఆరుగురు పోలీసులను మనోజ్కు గార్డులుగా నియమితులయ్యారు. ఉదయం 11:30కు విచారణ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ తతంగం చోటుచేసుకుంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top