అసమాన నటుడు సీఎం కేసీఆర్‌

అసమాన నటుడు సీఎం కేసీఆర్‌ - Sakshi

మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి

 

ములుగు : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నటుడైన తర్వాత ప్రజల నాయకుడయ్యాడు కాని సీఎం కేసీఆర్‌ నాయకుడైన తర్వాత అసమాన నటనతో ప్రజలను మోసం చేస్తున్నాడని కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర  వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని డీఎల్‌ఆర్‌ ఫంక్షన్ హాల్‌లో బుధవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రుణమాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో గతంలో ఎన్నుడూ లేని విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పోడుసాగు చేసుకుంటూ  జీవిస్తున్న వారిని గుర్తించి ప్రత్యేక చట్టం ద్వారా వారికి పట్టాలు అందిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూములు లాక్కొని రైతుల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. గుజరాత్‌ తర్వాత రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కనీసం రైతాంగానికి ఏక కాలంలో రుణమాఫీ చేసిన పాపన పోలేదన్నారు. పేద విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌పై గంపెడాశతో ఉన్నత చదువులు చదవాలని ఆశపడుతుంటే  వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తన ఇల్లును బంగారం చేసుకోవాలనే తపనతో బంగారు తెలంగాణ సాధిస్తానని కేసీఆర్‌ గొప్పలు చెబుతున్నాడే తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని ఎద్దేవా చేశారు.  

 

పెద్దనోట్ల రద్దుతో రైతుల ఇబ్బందులు  

పెద్దనోట్ల రద్దుతో నల్ల కుబేరులకు ఏ నష్టం జరుగుతుందో పక్కన పెడితే గ్రామాల్లో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంకటరమణారెడ్డి అన్నారు. కోతకు వచ్చిన వరి కోయించడానికి మిషన్ లకు, కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఈ ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్ మల్లాడి రాంరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్‌ కుసుమ వెంకటేశ్వర్లు, పార్టీ మండల అధ్యక్షుడు వేములపల్లి భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top