వీడని విభేదాలు

వీడని విభేదాలు - Sakshi


► సాలూరు టీడీపీలో రాజుకుంటున్న వివాదం

► సంధ్యారాణి అనుచరులపై మొదలైన కక్ష సాధింపు

► సీఎం ఆదేశాలతో రెచ్చిపోతున్నారని భంజ్‌దేవ్‌పై మండిపాటు

► జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్‌కు ఫిర్యాదు చేసిన సంధ్యారాణి వర్గీయులు




సాక్షి ప్రతినిధి, విజయనగరం :  ఊహించిందే జరిగింది. సాలూరు టీడీపీలో విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని సీఎం ఆదేశించిన వారం వ్యవధిలోనే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అనుచరులపై కక్ష సాధింపు ప్రారంభమయ్యింది. నియోజకవర్గ ఇన్‌చార్జి భంజ్‌దేవ్‌ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, తమను అన్నింటా తొక్కి పెడుతున్నారని సంధ్యారాణి అనుచరులు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు నేరుగా ఫిర్యాదు చేసి తమ ఆవేదన వెళ్ల గక్కారు.



మొదటినుంచీ వివాదమే...: తొలి నుంచీ భంజ్‌దేవ్, సంధ్యారాణి వర్గీయుల మధ్య పొసగడం లేదు. రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరినొకరు దెబ్బకొట్టుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. కొన్నాళ్లు పార్టీ ఇన్‌చార్జిగా సంధ్యారాణి చేయగా, ఆ తర్వాత ఇన్‌చార్జి బాధ్యతల్ని భంజ్‌దేవ్‌కు అప్పగించారు. ఎమ్మెల్సీ హోదాలో సంధ్యారాణి పనులు చేసుకుంటుండగా, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హోదాలో భంజ్‌దేవ్‌ చక్రం తిప్పుతున్నారు. ఇటీవల రాజధానిలో జరిగిన సమీక్షలో సీఎం జోక్యం చేసుకుని నాలుగైదు నెలల వరకు నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని సంధ్యారాణిని ఆదేశించారు. ఇదే అదనుగా ఆ రోజు నుంచే సం«ధ్యారాణి వర్గీయులపై కక్ష సాధింపు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎవరైనా తనవద్దకే రావాలని, ఇప్పుడేం చేస్తారో చూస్తానంటూ భంజ్‌దేవ్‌ బెట్టు కాయడాన్ని ప్రత్యర్థి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.



కమిటీల నియామకంలో వివక్ష: పార్టీ కార్యక్రమాలకు భంజ్‌దేవ్‌ డుమ్మా కొడుతున్నారని, కమిటీలను ఇంట్లో కూర్చొని వేస్తున్నారని, తన ఇంట్లో పనిచేసే మనుషులకే  కమిటీలో చోటు కల్పిస్తున్నారని, సాలూరు ఎంపీపీ జెంటిల్‌మెన్‌ ఒప్పందాన్ని అమలు చేయకుండా దాట వేస్తున్నారని, తమను రాజకీయంగా అణగదొక్కుతున్నారని సంధ్యారాణి వర్గీయులు జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో ప్రస్తుతం ఎంపీపీ బోని ఈశ్వరమ్మకు రెండున్నరేళ్లు, సారిక ఎంపీటీసీకి మిగతా రెండున్నరేళ్లు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని, ఇప్పుడా ఒప్పందాన్ని అమలు చేయకుండా భంజ్‌దేవ్‌ అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.  పథకాల లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చూపుతున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. దీనిపై జగదీష్‌ స్పందిస్తూ భంజ్‌దేవ్‌తో మాట్లాడుతానని, అప్పటికీ స్పందన లేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. భంజ్‌దేవ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అత్యాన తిరుపతిరావు, డొంకా అన్నపూర్ణమ్మ, సారిక మాజీ ఎంపీటీసీ రామన్నదొర, తుండ మాజీ సర్పంచ్‌ ధర్మరాజు, మరుపల్లి మాజీ సర్పంచ్‌ సత్యం తదితరులు ఉన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top