దీపావళిలోగా ఇంటికి జయలలిత

దీపావళిలోగా ఇంటికి జయలలిత - Sakshi


అన్నాడీఎంకే శ్రేణులు ఎదురుచూపులు

రికార్డు స్థాయిలో స్వాగతం @ ఎమ్మెల్యే కరుణాస్

అపోలో వద్ద నటి కుష్బు


దీపావళిని అమ్మతో పాటూ జరుపుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు ఆశతో ఎదురుచూస్తున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత పూర్తి ఆరోగ్యంతో వచ్చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆమె దీపావళిలోగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు.


 సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో దీపావళి పండుగకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. దీపావళికే ప్రథమ తాంబూలం. పేరుకు హిందువుల పండుగైనా కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ కొత్త బట్టలు కొనుగోలు చేసి, బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దీపావళి పండుగ సమయంలో ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందడం ఆమెను అభిమానించే ప్రజలకు, ముఖ్యంగా అన్నాడీఎంకే శ్రేణులకు ఆవేదన కలిగించే అంశం.


గతనెల 22న అర్ధరాత్రి అపోలోలో చేరిన ముఖ్యమంత్రి జయలలిత ఈ 33 రోజుల్లో బాగా కోలుకున్నారు. దాదాపుగా సాధారణ స్థితికి చేరినట్లు వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ రిచర్డ్ లండన్ నుంచి ఆదివారం రాత్రి చెన్నైకి చేరుకుని సోమవారం అపోలో ఆసుపత్రికి వచ్చారు. ఇప్పటి వరకు సీఎంకు జరిగిన చికిత్సలను మరోసారి సమీక్షించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అందుకు తగ్గ చికిత్స ప్రారంభించారు. అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి చిన్నపాటి కార్యకర్త మొదలుకుని అగ్రనేతల వరకు అందరూ ప్రార్థనల్లో మునిగి తేలుతున్నారు. చెన్నైతో పాటూ పరిసరాల్లోని నేతలు అపోలో వద్దనే   గడుపుతున్నారు.


అమ్మ కోలుకుంటున్నట్లు వస్తున్న సమాచారంతో వారిలో ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీపావళి పండుగ దినాల్లో అమ్మ ఆసుపత్రిలోనే ఉంటే అన్నాడీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకునే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని జయలలిత దీపావళిలోగా డిశ్చార్జ్ అయ్యేలా వైద్యులను కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సాధారణ  స్థితిలో శ్వాస తీసుకోవడంతో పాటూ తనకు తానే ఆహారాన్ని స్వీకరిస్తున్నందున దీపావళిలోగా డిశ్చార్జ్ ఖాయమని గట్టిగా విశ్వసిస్తున్నారు.


తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, నటి కుష్బు సోమవారం అపోలో ఆసుపత్రికి చేరుకుని సీఎం ఆరోగ్యం గురించి వాకబు చేశారు. దీపావళిలోగా సీఎం ఇంటికి చేరుకుంటారని, ప్రజలతో కలిసి పండుగ చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కుష్బు అన్నారు. ఆమె రాక కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు,  సంపూర్ణ ఆరోగ్యంతో దీపావళిలోగా ఇంటికి చేరుకోవాలి, ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.


సీపీఎం సీనియర్ నేత పాండియన్ సైతం అపోలోకు వచ్చి సీఎంకు జరుగుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో  నెల్లితోప్పు నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీచేస్తున్న ఓం శక్తిశేఖర్ సోమవారం అపోలో ఆసుపత్రికి వ చ్చారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై మంత్రులను అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆశీర్వాదంతో తాను గెలిచి తీరుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామిపై ఓం శక్తి శేఖర్ పోటీ చేస్తున్నారు.


ఘన స్వాగతానికి ఏర్పాట్లు : ఎమ్మెల్యే కరుణాస్

దీపావళి పండుగ రోజున సీఎం జయలలిత డిశ్చార్జయి ఇంటికి చేరుకునే సమయంలో ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అన్నాడీఎంకే ఎమ్మెల్యే, తమిళ సినీ హాస్యనటుడు కరుణాస్ మీడియాకు తెలిపారు. సీఎం కారు వెనుక వస్తుండగా పెద్ద సంఖ్యలో గుర్రాలు, ఏనుగులు, దారిపొడవునా బాణాసంచా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అపోలో ఆసుపత్రి నుంచి పోయస్ గార్డెన్‌లోని సీఎం ఇంటివరకు సాగే ఈ స్వాగత సంబరాలు ప్రపంచ రికార్డుగా నిలిచిపోగలవని ఆయన అన్నారు.


బెయిల్‌కు నో :నామక్కల్ జిల్లా తిరుచెంగోడుకు చెందిన  సతీష్‌కుమార్(24) ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు రేపగా ఈనెల 10వ తేదీన సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పుళల్ జైల్లో ఉన్న సతీష్‌కుమార్ జామీను కోరుతూ చెన్నై సెషన్స్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ జామీను దరఖాస్తు సోమవారం విచారణకు రాగా, పోలీసు తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడంతో జామీను ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.


 అమ్మ కోసం ఆరాధనలు : సీఎం ఆరోగ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరాధనలు, ప్రార్థనలు సాగుతున్నాయి. చెన్నై టీనగర్‌లోని శ్రీచక్ర వినాయక ఆలయంలో పార్టీ నేతలు 108 మంది పాల కలశాలతో పూజలు చేశారు. అలాగే పల్లవరంలోని ఆలయంలో 1,008 మంది మహిళలు పాలాభిషేకం చేశారు. కోయంబత్తూరు పీలమేడులోని కరివరదరాజ పెరుమాళ్ ఆలయంలో మాజీ మంత్రి వేలుస్వామి నేతృత్వంలో విష్ణు సహస్రనామార్చన చేపట్టారు.


ఫ్రాన్స్‌ యువతి అరెస్ట్‌?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సామాజిక మాధ్యమం ద్వారా వదంతులు రేపిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో నివసిస్తున్న తమిళ యువతి తమిళచ్చిపై సైబర్‌ క్రైం పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో ఆమెను సోమవారం ఫ్రాన్స్‌ దేశంలో అరెస్ట్‌ చేసినట్లు అనధికారిక సమాచారం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top