గర్భసంచిలో వస్త్రం ముక్క పెట్టి కుట్టేశారు

గర్భసంచిలో వస్త్రం ముక్క పెట్టి కుట్టేశారు


బెంగళూరు : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ గర్భసంచిలో ఓ చిన్నపాటి వస్త్రం ముక్క మూడు నెలల పాటు ఉండిపోయింది. ఉడిపి జిల్లా కుందాపురలో ఈ సంఘటన చోటు చేసుకోగా, మంగళవారం దీనిపై మహిళ బంధువులు నర్సింగ్ హోమ్‌లో వైద్యులను నిలదీశారు. వివరాల్లోకి వెళితే... కుందాపుర తాలూకాలోని కేడూరుకు చెందిన సులోచనా శెట్టి (31) రెండో బిడ్డ ప్రసవం కోసం అక్కడి దేవి నర్సింగ్ హోమ్‌లో చేరింది. జూన్ 24న సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. అనంతరం ఆమెకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కూడా చేశారు. జూలై 7న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సులోచనకు తరచూ పొత్తి కడుపులో నొప్పి వచ్చి, రక్తస్రావం అయ్యేది.

 

 ఈ క్రమంలో ఆమె కుందాపురలోని విక్రమ్ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి, స్కానింగ్ చేయించుకుంది. అక్కడి సిబ్బంది స్కానింగ్ నివేదికను ఆమెకు ఇవ్వకుండా, నేరుగా డాక్టరుకు ఇస్తామని చెప్పి పంపేశారు. తిరిగి నర్సింగ్ హోమ్‌కు వచ్చిన ఆమెకు చిన్నపాటి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. రెండో సర్జరీకి కారణమేమిటని అడిగినా వైద్యులు సమాధానం చెప్పలేక పోయారు. దీంతో భర్త అరుణ్ కుమార్ ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి చూపించారు. మళ్లీ స్కానింగ్ చేయించగా, అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

 

 అయినా రక్తస్రావం ఆగక పోవడంతో ఇక్కడి సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ చేయించినప్పుడు 4.5 X 2.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న వస్త్రం ముక్క ఆమె గర్భ సంచిలో ఉన్నట్లు తేలింది. వెంటనే వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా దానిని తొలగించారు. దాదాపు మూడు నెలల పాటు అది కడుపులోనే ఉండిపోవడంతో ఏర్పడిన గాయాలకు కుట్లు వేయడానికి మరో శస్త్ర చికిత్స కూడా చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఈ శస్త్ర చికిత్సలకు రూ.2 లక్షలు ఖర్చయింది. దీనిపై పోలీసులతో పాటు వినియోగదారుల వేదికకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top