'మూతపడిన పరిశ్రమలను తెరిపించాలి'


సంగారెడ్డి మున్సిపాలిటీ : రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో ఆమోదించిన తీర్మానాలను శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కార్మిక చట్టంలోని 65వ షెడ్యూల్డ్‌లో పేర్కొన్న విధంగా పరిశ్రమల్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయాలని నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు చేయడం లేదన్నారు.



రాష్ట్ర ప్రభుత్వం వేసిన సదానందగౌడ్ చెర్మన్‌గా ఉన్న కమిటీలో అన్ని కార్మిక సంఘాల బాధ్యులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. కార్మికుల కనీస వేతనం రూ.18వేలు ఉండాలని తమ కమిటీ తరఫున తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. ప్రతి ఆరు నెలలకు పెరిగే డీఏ పాయింట్‌ను రూ.600 పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నూతన వేతన ఒప్పందం చేయడం వల్ల పెరిగే వేతనంతో ప్రభుత్వంపై పైసా భారం పడదని, అయినా ఎందుకు జాప్యం చేస్తున్నారని సాయిబాబ ప్రశ్నించారు.



కార్మిక సంఘం నాయకుడిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని గెలిపిస్తే పరిశ్రమను ఆర్థికంగా అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు ఆయనను 500 ఓట్ల మెజారిటీతో గెలిపించారన్నారు. కానీ, పరిశ్రమను మూసివేసినా మంత్రి స్పందించలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ విధానాలతో పరిశ్రమలు మూత పడుతున్నాయని తెలిపారు. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. అందుకు గాను మూత పడిన పరిశ్రమలను తెరిపించడంతో పాటు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70వేల అంగన్‌వాడీ కేంద్రాలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదన్నారు. గతంలో ఐసీడీఎస్‌కు ఇస్తున్న నిధులను 90 నుంచి 60 శాతానికి తగ్గించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు మాణిక్యం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top