ప్రజల్లోకి జయ విజయాలు


 చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్నాడీఎంకే సన్నద్ధం అవుతోంది. ఈనెల 10 వ తేదీ నుంచి మూడురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహించాలని పార్టీ అధినేత్రి జయలలిత మంగళవారం ఆదేశించారు. 2011లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జయలలిత నాలుగేళ్లు పూర్తిచేసుకుని ఐదో ఏట అడుగుపెట్టారు. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రత్యేక విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె కోరారు. విద్యుత్ కోతల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆమె సూచించారు. అమ్మ క్యాంటిన్లు పేదల ఆకలిని తీరుస్తున్నాయని, అమ్మ ఫార్మసీలు తక్కువ ధరకే మందులను సరఫరా చేస్తూ ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడుతున్నాయని ఆమె తెలిపారు. పెద్దలకు మాత్రమే పరిమితమైన సొంతింటి కలను పేదలకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు అమ్మ సిమెంట్ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. అలాగే నగరంలోని ట్రాఫిక్ రద్దీకి జవాబుగా మెట్రోరైలు సేవలు రాష్ట్ర చరిత్రలో తలమానికంగా నిలిపిన ఘనత తమదేనని ఆమె అన్నారు.

 

  అన్నాడీఎంకే ప్రభుత్వం సాధిస్తున్న విజయాల పరంపరను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు ఎన్ని పన్నాగాలు పన్నినా దేవుడు నిజాయితీవైపే నిలిచాడని ఆమె చెప్పారు. అందుకనే అనేక అడ్డంకులను అధిగమించి ప్రజల ముందుకు వచ్చానని చెప్పారు. ప్రజలు సైతం తనను అక్కున చేర్చుకుని ఆర్కేనగర్ నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీని సాధించిపెట్టారని ఆమె తెలిపారు. మంచివాళ్ల లక్ష్యం నెరవేరడం నిశ్చయం అనే ఎంజీఆర్ మాటలను ఆమె గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నూరుశాతం నెరవేర్చిన ఘనత ఆన్నాడీఎంకే మాత్రమే సొంతమని ఆమె పేర్కొన్నారు. నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను సభలతోపాటూ, కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని ఆమె ఆదేశించారు. నగరాలు మొదలుకుని క్షేత్రస్థాయిలో ప్రచారం సాగాలని ఆమె అన్నారు. ఈనెల 10, 11, 12 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించాలని జయ ఆదేశించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top