నన్ను కాపాడే మగాళ్లే లేరా?

నన్ను కాపాడే మగాళ్లే లేరా?


హతురాలు స్వాతి ఆత్మక్షోభ

సామాజిక మాధ్యమాల్లో హృదయవిదారక కథనం


 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24) పట్టపగలే దారుణహత్యకు గురికావడంతో రాష్ట్రమంతా చలించిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు చూస్తుండగానే ఆ యువతిని విచక్షణారహితంగా ఓ యువకుడు హతమార్చడంపై సామాజిక మాధ్యమాలు బాధ్యతారహిత పౌరులపై విమర్శలు గుప్పించాయి. పసి వయస్సులోనే అసువులు బాసిన స్వాతి ఆత్మ ఏ విధంగా క్షోభించి ఉంటుందో ఊహిస్తూ హృదయవిదారక కథనాన్ని సామాజిక మాధ్యమాలు ప్రచారం చేశాయి.

 

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.‘ అందరి యువతుల్లానే నేను జీవితంపై కలలు గన్నాను. అవేమీ పెద్ద కలలు కావు. మంచి ఉద్యోగం, మంచి కుటుబంతో ఆహాయిగా జీవించాలని ఆశించాను. నాపై అలాంటి ఆశలే పెట్టుకున్న మా నాన్న ఆఫీసుకని బయలుదేరిన నన్ను ఎప్పటి వలెనే నుంగంబాకం రైల్వేస్టేషన్‌కు వచ్చి డ్రాప్ చేసి వెళ్లాడు. అదే అదను కోసం కాచుకుని ఉన్న ఓ యువకుడు నన్ను ఒంటరిని చేసి తగవులాడాడు, అతని నుంచి దూరంగా వెళ్లిపోతున్న తనను వెంటాడి వేటకత్తితో వేటాడాడు.

 

విచక్షణారహితంగా పొడిచి చంపాడు. నా పట్ల ఓ రాక్షసుడిలా వ్యవహరిస్తున్న అతడి ఆగడాలను అదే రైల్వేప్లాట్‌ఫాంపై ఉన్న ప్రజలు ఎవ్వరూ పట్టించుకోలేదు. కత్తితో నరికివేస్తున్నా ఒక్క మగాడు కూడా వచ్చి అడ్డుకోలేదు. పైగా పొంచి ఉండి హత్యాకాండను తిలకించారు. ఓ యువతిని బహిరంగంగా నరుకుతుంటే ఆపే మగాడే ఆ రోజు లేడా. వీరంతా జనాభా లెక్కల్లోనూ, జెండర్ పరంగా మాత్రమే మగాళ్లు. ఈ రోజు నేను చచ్చిపోయాను, రెండు మూడు రోజుల్లో నాగురించి మర్చిపోతారు. పోలీసులు ఏదో ఒక రోజు ఆ యువకుడిని పట్టుకుంటారు. కోర్టులో అతను నాపైనే ఏవో తప్పులు చెబుతాడు.

 

యువకుడు చెబుతున్నవన్నీ అవాస్తవాలు అని వాదించేందుకు నేను లేను. జీవితంపై ఎంతో ఆశలు పెట్టుకున్న తనను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నా మనకెందుకు లెమ్మనేలా వ్యవహరించడంపట్ల ఆ రోజు ప్లాట్‌ఫారంపై ఉన్న ప్రజలే కాదు మొత్తం సమాజం తలవంచుకోవాలి. ఇప్పటికైనా మారండి, మగాళ్లని నిరూపించుకోండి’.    ఇలా సాగిన కథనం వీక్షకుల కంటి తడి పెట్టించింది.

 

ఎవ్వరితోనూ విరోధంగా వ్యవహరించని స్వాతి విధి చేతుల్లో బలైపోయిందని తండ్రి గోపాలకృష్ణన్ వాపోయారు. రైల్వేస్టేషన్‌లో వదిలి వచ్చిన కొద్దిసేపట్లోనే నా కుమార్తెను హత్య చేశారని పోలీసులు చెప్పినప్పుడు నమ్మలేక పోయానని అన్నారు. తెలిసిన వారితోనే కాదు తెలియని వారితో సైతం మంచి ఉండే స్వాతికి శత్రువులు ఉంటారంటే నమ్మశక్యం కావడం లేదని స్నేహితుడు సిద్ధు వాపోయాడు.

 

 కిరాయి హంతకుడా:            

స్వాతి హత్యకు ఓ కిరాయి హంతకుడాని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజల సమక్షంలో పెద్ద కత్తితో హత్య చేసే దుస్సాహసానికి కిరాయి హంతుకులే పాల్పడుతారని భావిస్తున్నారు. అలాగే అక్కడికి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో ఒక యువకుడు స్కూల్‌బ్యాగ్‌ను తగిలించుకుని ఆవేశంగా వెళ్లడాన్ని గుర్తించి ఆరాతీస్తున్నారు. సంఘటన జరిగి 24 గంటల్లో సుమారు వందమంది అనుమానితులను విచారించారు. స్వాతి స్నేహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top