శ్రుతిహాసన్‌ వివాదం సుఖాంతం అయ్యింది

శ్రుతిహాసన్‌ వివాదం సుఖాంతం అయ్యింది - Sakshi


నటి శ్రుతిహాసన్‌కు ఊరట కలిగింది. ఇటీవల ఆరోపణలు, కోర్టులు అంటూ కోలీవుడ్, టాలీవుడ్‌లలో సంచలనం సృష్టించిన ఆమె వ్యవహారం సుఖాంతం అయ్యింది. టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కోలీవుడ్ యువ నటుడు కార్తీ జంటగా పిక్చర్ హౌస్ మీడియా సంస్థ భారీ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కార్తీ సరసన నటి శ్రుతిహాసన్‌ను ఎంపిక చేశారు. అయితే చిత్ర షూటింగ్ ప్రారంభమైన తరువాత శ్రుతి చిత్రం నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు.

 

 దీంతో షాక్‌కు గురైన చిత్ర నిర్మాతలు ఆమెపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి విచారణ పూర్తి అయ్యే వరకు శ్రుతిహాసన్ కొత్త చిత్రాలను అంగీకరించరాదంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగానే తాను ఆ చిత్రం నుంచి వైదొలిగినట్లు, ఈ కేసు విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతల వర్గం నటి తమన్నను తన స్థానంలో ఎంపిక చేసిందని, ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని, కాబట్టి కొత్త చిత్రాలను అంగీకరించరాదని తనపై విధించిన నిషేధాజ్ఞలు తొలగించాలని శ్రుతిహాసన్ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

 సామరస్య చర్చలు:

 అదే విధంగా శ్రుతి దక్షిణభారత నటీనటుల సంఘంలోను ఫిర్యాదు చేశారు. ఇక పిక్చర్ హౌస్ మీడియా సంస్థ అధినేతలు కూడా తమిళనాడు నిర్మాతల మండలిలో శ్రుతిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రెండు సంఘాల ప్రతినిధులు ఈ వ్యవహారంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను, ఉపాధ్యక్షుడు పి ఎల్ తేనప్పన్, కార్యదర్శి టి.శివ, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

 

 పిక్చర్ హౌస్ మీడియా ప్రతినిధి ముంబయిలో ఉన్న నటి శ్రుతిహాసన్‌తోను ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. సంఘ ప్రతినిధుల కోరిక మేరకు పిక్చర్ హౌస్ మీడియా కోర్టు కేసును వాపస్ చేసుకోవడానికి అంగీకరించింది. దీంతో శ్రుతి, పిక్చర్ హౌస్ మీడియాల వివాదం సుఖాంతం అయ్యింది. ఈ మేరకు పిక్చర్ హౌస్ మీడియా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో శ్రుతిహాసన్ అజిత్ సరసన నటించడానికి లైన్ క్లియర్ అయ్యింది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top