కోడెల మాటల్లో తప్పేముంది?

కోడెల మాటల్లో తప్పేముంది? - Sakshi


మహిళలపై స్పీకర్‌ వ్యాఖ్యలను సమర్థ్ధించిన సీఎం

జాతీయ మీడియా అమ్ముడుపోయిందంటూ వ్యాఖ్యలు




కోడెల పాజిటివ్‌గా చెబితే నెగిటివ్‌ ప్రచారం చేశారని మండిపాటు

మహిళా పార్లమెంట్‌ సదస్సు విజయవంతమైతే ఏదేదో రాస్తారా?



సాక్షి, అమరావతి : ‘స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు మాటల్లో తప్పేముంది.. ఎక్కడ తప్పుంది? ఆయన భావ వ్యక్తీకరణలో తేడా ఉంది.. స్పీకర్‌నే అప్రతిష్ఠపాలు చేస్తారా? స్పీకర్‌ స్థానానికి గౌరవం ఇవ్వరా? ఆయన మహిళల గురించి పాజిటివ్‌గా చెబితే మీరు నెగిటివ్‌గా రాసి ఇష్యూ చేస్తారా? హద్దులు అందరికీ ఉన్నాయి. దాటితే అందరూ బాధ్యులే. నేషనల్‌ మీడియా కూడా ఇష్టం వచ్చినట్లు రాసింది. దాన్ని కూడా డబ్బులు పెట్టి కొనేశారు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.



మహిళా పార్లమెంట్‌ సదస్సుకు సోషల్‌ మీడియా ద్వారా మంచి స్పందన వచ్చిందని, 7,71,74,960 మందిని ప్రభావితం చేశామన్నారు. సదస్సుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి, తీరా ఆమెను రానివ్వకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించగా ‘ఏం చెప్పారు.. మేమొచ్చి గొడవ చేస్తామన్నారు. పోలీసులకు ఆ సమాచారం ఉంటే యాక్ట్‌ చేయరా? రభస చేస్తాం అంటే వదిలి పెడతారా.. లేకుంటే పోలీసులపై మేం చర్యలు తీసుకోమా? అందుకే వారి పని వారు చేశారు. మహిళా పార్లమెంట్‌ను డిస్ట్రబ్‌ చేయటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. తుని ఘటనతో ప్రతిష్ట పోగొట్టారు, వైజాగ్‌లో రిపబ్లిక్‌ డే రోజున ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తిరుపతిలో సైన్స్‌ కాంగ్రెస్‌ను అడ్డుకునే యత్నం చేశారు. ఇలా ప్రతి దానినీ అడ్డుకుంటున్నారు.



అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, మంత్రులు తెలుగుదేశం పార్టీ వారు, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిందనే సెన్స్‌ కూడా లేకుండా రాశారు. సైకిల్‌ టీడీపీది, టీడీపీకి ప్రజలు ఓట్లు వేశారు. ఇది తప్పు ఎలా అవుతుంద’ని ప్రశ్నించారు. ‘డెలిగేట్స్‌ ఆవులిస్తే నిదురపోతున్నారని రాశారు. మీకు ఆవులింతలు రావా? నెగటివ్‌గా రాయాలని కొందరిలో జీర్ణించుకుపోయింది. డెక్కన్‌ క్రానికల్‌ కూడా, జాతీయ మీడియా కూడా వ్యతిరేకంగా రాసింది. అసత్య ప్రచారం చేసింద’ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



 ఇంతకూ కోడెల ఏమన్నారంటే..

జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సు ప్రారంభానికి ముందు బుధవారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏపీడబ్ల్యూ జే ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళల భద్రతపై విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు రాష్ట్ర శాసనసభ సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ సమాధానమిస్తూ.. ‘ఒక వెహికల్‌ కొన్నారనుకోండి. ఇంట్లో, షెడ్‌లో పెడితే యాక్సిడెంట్లు జరగవు కదా.. అదే బజారుకు పోతే, రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్‌ జరిగే అవకాశాలుంటాయి. 50 కిలోమీటర్ల తక్కువ స్పీడులో పోతే యాక్సిడెంట్లు అయ్యేందుకు తక్కువ అవకాశాలుంటాయి. 100 కిలోమీటర్ల స్పీడులో వెళితే యాక్సిడెంట్లు పెరుగుతాయి.



అలాగే ఆడ పిల్లలు హౌస్‌ వైఫ్‌లా గతంలోలా ఉంటే వాళ్లమీద  ఏమీ జరగవు. ఎక్సెప్ట్‌ డిస్క్రిమినేషన్‌ (లింగ వివక్ష లేకపోతే). వాళ్లు ఇప్పుడు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. దే ఆర్‌ ఎక్స్‌పోజ్‌డ్‌ టు సొసైటి. అలా ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఈవ్‌టీజింగ్‌ కావచ్చు, హరాస్‌మెంట్‌ కావచ్చు. అట్రాసిటీస్‌ కావచ్చు. రేప్స్‌ కావచ్చు. కిడ్నాప్స్‌ కావచ్చు. పెరుగుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు పోకపోతే జరగవు’ అన్నారు.  



మద్దతివ్వకపోతే వైఎస్సార్‌ జిల్లాను అభివృద్ధి చేయలేను: సీఎం  

వైఎస్సార్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వకపోతే అక్కడ అభివృద్ధి పనులు చేయలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో సోమవారం వైఎస్సార్‌ జిల్లా టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమావేశంలో కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలా గెలుచుకోవాలనే అంశంపై చర్చించారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఒక్క వైఎస్సార్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పోయినా తనకు వచ్చే ఇబ్బంది లేదని, కానీ అభివృద్ధి కావాలంటే తనను బలపరచా లన్నారు. సమావేశంలో కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్, జిల్లా నేతలు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top