ఏపీలో పెట్టుబడులు పెట్టండి

ఏపీలో పెట్టుబడులు పెట్టండి


దక్షిణ కొరియాను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తయారీ, ఓడరేవు రంగంలో ఉన్న అపార అవకాశాలను దక్షిణ కొరియా అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబుకోరారు. రాష్ట్రంలో ఉన్న 974 కి.మీ సముద్ర తీరంలో ఓడరేవుల అనుబంధ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. గురువారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కొరియా పారిశ్రామికవేత్తలతో కలసి  రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సల్ జనరల్ క్యుంగ్సూ కిమ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.



ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృష్ణపట్నం, భావనపాడు, వైజాగ్ పోర్టులు దక్షిణ కొరియాకు వాణిజ్యపరంగా అనుకూలంగా ఉంటాయన్నారు. రాజధాని అమరావతిలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియాను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. దీనిపై క్యుంగ్సూ కిమ్ స్పందిస్తూ ఈ అంశాన్ని తమ దేశం తప్పక పరిశీలిస్తుందన్నారు.



మీ నిధులపై పూర్తి హక్కులు మాకే: వివిధ ప్రాజెక్టుల కింద నాబార్డు ఇచ్చే నిధులను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాడుకునే విధంగా వీలుకల్పించాలని, అలా కల్పిస్తే నూరు శాతం ఫలితాలు చూపిస్తామని నాబార్డుకు ముఖ్యమంత్రి చెప్పారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ వీవీవీ సత్యనారాయణ తనను కలసిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.



విద్యాదానానికి నిధులు అడగండి: సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు దేవాలయాలకు, ఆసుపత్రులకు నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో విద్యాదానానికి కూడా నిధులు ఇచ్చేలా వారిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అన్న దానానికి కార్పస్‌ఫండ్ పోగవుతున్నట్లుగానే విద్యాదానానికి కూడా విద్యా సంస్థల్లో పోగయ్యేలా చూడాలన్నారు. గురువారం తన నివాసం నుంచి ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ ఉప కులపతులు, ప్రిన్సిపల్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.



గిరిజన ప్రాంతంలోని శివారు గ్రామాలకు, గూడేలలో ఇంటింటికీ మినరల్ వాటర్ సరఫరా చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా నియంత్రణకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా సీఎం సీఎం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన దళిత,గిరిజన బాట సభలో కూడా పాల్గొని ప్రసంగించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top