బీజేపీ ఆశలన్నీ ఓట్ల చీలికపైనే...!


కాంగ్రెస్‌కు మరిన్ని ఓట్లుపడితే లబ్ధి పొందవచ్చని అంచనా

సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ... కాంగ్రెస్ పార్టీ ఓటర్లపై కన్నేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకును చీల్చితే ప్రయోజనం దక్కుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరిన్ని ఓట్లు పడితే ఎక్కువ సీట్లు తమ ఖాతాలో పడతాయని వారు అంటున్నారు.



ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్‌షోకి స్థానికులు పెద్దసంఖ్యలో రావడం తమకు లాభిస్తుందనేది వారి యోచన. కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 18 శాతం ఓట్లు పడితే తమకు ఎక్కువ సీట్లు వస్తాయనేది పార్టీ వ్యూహకర్తల అంచనా. కాంగ్రెస్ ఓటు శాతం తగ్గితే మాత్రం ఆప్ లాభపడుతుందని  వారు అంటున్నారు. దళితులు, ముస్లింలు, అనధికార కాలనీ, పునరావాసకాలనీవాసులను సంప్రదాయ కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా పరిగణించేవారు. అయితే గత ఎన్నికలలో వీరంతా ఆప్‌కు ఓటేశారు, దీంతో కాంగ్రెస్‌కు ఊహించనిరీతిలో దెబ్బతగిలింది. ఈ ఎన్నికల్లో దళితులు ముస్లింలు, అనధికార కాలనీవాసులు కనుక ఆప్ వైపు మొగ్గుచూపితే నష్టపోతామనే విషయాన్ని బీజేపీ గుర్తించింది. ఈ ఎన్నికల్లో మరిన్ని దళిత సీట్లను దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా ఆ వర్గానికి చెందిన కృష్ణతీరథ్‌ను పార్టీలో చేరుకుంది.



అంబేద్కర్‌నగర్ రిజర్వ్‌డ్ సీటు నుంచి గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా గెలిచిన అశోక్‌కుమార్‌ను బీజేపీ ఈసారి తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కృష్ణతీరథ్ కారణంగా పటేల్‌నగర్, అశోక్‌కుమార్ కారణంగా అంబేద్కర్‌నగర్ నియోజకవర్గాలు తమ ఖాతాలో  పడతాయనే నమ్మకంతో ఆ పార్టీ ఉంది. నగరంలో 16 శాతం మంది దళిత ఓటర్లున్నారు. షెడ్యూల్డు కులాలకు రిజర్వ్ చేసిన 12 సీట్లతో పాటు మొత్తం 17చోట్ల జరిగే ఎన్నికలపై దళిత ఓట్ల ప్రభావం కనిపించనుంది. అనధికార కాలనీ క్రమబద్ధీకరణ దిశగా మోడీ సర్కారు చేపట్టిన చర్యల ఫలితంగా ఆయా ఓటర్లు మొగ్గుచూపవచ్చని కమలం భావిస్తోంది.  

 

మధ్యతరగతివారిని బీజేపీ సాధారణంగా తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోంది. అయితే గత ఎన్నికల్లో వారిలో కొంతమంది కేజ్రీవాల్‌వైపు మొగ్గు చూపారు. ఫలితంగా జాతీయ రాజధానిలో బీజేపీ...ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. దాదాపు ఐదుశాతం మంది మధ్యతరగతి ప్రజలు ఆప్‌కు ఓటేసినట్టు ఆ పార్టీ అంతర్గత నివేదికలు స్పష్టం చేశాయి. అయితే మధ్యతరగతి ఓటర్లకు ఆప్‌పై భ్రమలు తొలగిపోయాయనని బీజేపీ నేతలు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మధ్యతరగతి ఓట్లు తమకే పడ్డాయని బీజేపీ చెబుతోంది.



ఈసారికూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని ఆ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. నరేంద్ర మోదీ పేరుబలం, ఇటీవలి ఒబామా పర్యటన మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకుంటాయని కమలదళం భావిస్తోంది. మహిళల ఓట్లు తమకే దకకుతాయన్న ధీమాతో బీజేపీ ఉంది. దేశంలో మొదటి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడిని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడం మహిళలను ఆకట్టుకుంటుందని వారు అంటున్నారు.



మహిళల భద్రత కోసం కిరణ్ బేడీ తప్పక చర్యలు చేపడతారనే సకారాత్మక సందేశం మహిళలకు అందుతోందని వారు పేర్కొంటున్నారు, అకాలీదళ్‌తో పొత్తును కొనసాగించడంతోపాటు 1984 సిక్కుల అల్లర్ల బాధితులకు నష్టపరిహారాన్ని పెంచుతూ కేంద్రం చేపట్టిన చర్య, పలువురు సిక్కు నేతలు తమ పార్టీలో చేరడం కూడా లాభిస్తుందని కూడా ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top