కామత్ ఇంటివద్ద బీజేపీ ఆందోళన

కామత్ ఇంటివద్ద బీజేపీ ఆందోళన - Sakshi


♦ స్మృతి ఇరానీపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే..

♦ రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి: బీజేపీ నేత సాల్వి

♦ నేనేమీ తప్పుగా మాట్లాడలేదు: గురుదాస్ కామత్

 

 ముంబై : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గురుదాస్ కామత్ ఇంటివద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆదివారం చెంబూర్‌లోని ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టిన బీ జేపీ కార్యకర్తలు, కామత్ వెంటనే రాతపూర్వకంగా క్షమాపణ కోరాలని డిమాండు చేశారు. ‘ఒక మహిళపై నిందలు వేసే ముం దు, వాటి తర్వాత ఎదురయ్యే సమస్యలకు కూడా సిద్ధంగా ఉండాలి. కానీ కామత్‌కు మా ఆందోళనను ఎదుర్కొనే ధైర్యం లేదు’ అని బీజేపీ మహిళా విభాగం నేత షలకా సాల్వి విమర్శించారు. కామత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ఎక్కడ సమావేశం అయితే అక్కడ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ముంబై రీజియన్ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్‌సీసీ) అధ్యక్షుడు సంజయ్ నిరుపం తనను తొక్కేయడంతో, ఇప్పుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ప్రచారం ద క్కించుకోవాలని కామత్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ ముంబై విభాగం ఉపాధ్యక్షుడు మో హిత్ కాంబోజ్ ఆరోపించారు. మీడియాలో ముఖం కనిపించాలని స్మృతిపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

 మీడియా నా మాటలు వక్రీకరించింది: కామత్

 మొత్తం వ్యవహారంపై స్పందించిన కామత్, ‘నేనెప్పుడు మహిళల పట్ల గౌరవపూర్వకంగానే ప్రవర్తించాను. మెక్‌డానాల్డ్స్‌లో పనిచేశానన్న స్మృతి వ్యాఖ్యలనే నేను ఉటంకించాను. అయితే కొన్ని మీడియా సంస్థలు నా మాటలను వక్రీకరించాయి’ అని వివరించారు. ‘ధ్రువపత్రాల విషయంలో వివాదం ఎదుర్కొంటున్న ఇరానీకి ముఖ్యమైన మంత్రిత్వ శాఖను ఎందుకు కేటాయించారని ప్రధాన నరేంద్ర మోదీని ప్రశ్నించాను. ఇందులో తప్పేంటి?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. గత వారం రాజస్తాన్‌లో మాట్లాడుతూ, ఇరానీని పోన్చా లగానే వాలీ (శుభ్రపరిచే మహిళ) అని పోల్చిన కామత్, విద్యా మంత్రిత్వ శాఖను ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. ఈ వివాదంపై తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్, తన అనుచిత వ్యాఖ్యలపై వారం రోజుల లోపు వివరణ ఇవ్వాలని కామత్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి తనకు ఎలాంటి నోటీసు అందలేదని, అది అందిన తర్వాత చూసుకుంటానని కామత్ చెప్పారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top