ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు - Sakshi

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలును ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్యాడ్యుయేట్, రెండు టీచర్స్ నియోజకవర్గాలకు, అలాగే తెలంగాణలో ఖాళీ కాబోతున్న టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఈ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది.

 

ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 13 న నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 9 న పోలింగ్ నిర్వహించి 15 న లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 20 వరకు గడువు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంవీఎస్ శర్మ, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు గ్రాడ్యుయేట్స్ నియోజవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాస రెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎం. గేయానంద్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు టీచర్స్ స్థానం ఎమ్మెల్సీ వి బాలసుబ్రమణ్యం, కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది. అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ స్థానం నుంచి కాటిపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం కూడా అదే సమయానికి ముగియనుంది.

 

రెండు రాష్ట్రాల్లో ముగుస్తోన్న ఈ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలును ప్రకటించగా, బీహార్ రాష్ట్రానికి చెందిన రెండు ఉపాధ్యాయ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే షెడ్యూలును ప్రకటించింది. మార్చి 9 న పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ స్థానాల కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటర్ల తుది జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top