పట్టాలు తప్పి..ప్రాణాలు నిలిచి!

పట్టాలు తప్పి..ప్రాణాలు నిలిచి!


అప్పటి దాకా గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు వచ్చిన పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అంతలోనే కొన్ని బోగీలు కళ్లెదుటే కూలిపోతుండడం చూసి గాబరాపడ్డారు.

డ్రైవర్ చాకచక్యంతో చివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  


 

వేలూరు: కన్యాకుమారిలో గురువారం రాత్రి 24 బోగీలతో ఐల్యాండ్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరుకు బయలుదేరింది. తెల్లవారుజాము 3.55 గంటల సమయంలో వేలూరు జిల్లా తిరుపత్తూరు సమీపంలో సిగ్నల్ కోసం ఆగింది. సిగ్నల్ అందిన వెంటనే రైలు బెంగళూరు వైపునకు బయలు దేరింది. సుమారు పది కిలో మీటరు దూరం వెళ్లిన వెంటనే 4.10గంటలకు రైలు బోగీలు భారీగా కుదుపులకు లోనయ్యాయి. గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోగా ఎస్4 నుంచి ఎస్ 9 వరకు ఆరు స్లీపర్ బోగీలు బోల్తా పడ్డాయి.



ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నాట్రంబల్లి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. తీవ్రగాయాలైన 20 మంది ప్రయాణికులను 108 అంబులెన్స్‌లో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని క్షత గాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. వేలూరు జిల్లా కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ సెంథిల్ కుమారి, రైల్వే ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే రైళ్లన్నీ పూర్తిగా రద్దు చేశారు.



జోలార్‌పేట- బెంగళూరు నుంచి వచ్చే రైళ్లు కిలో మీటర్ల దూరంలో నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన రైల్వే సిబ్బంది రైలు పట్టాలకు మరమ్మతులు చేపట్టారు.

 డ్రైవర్ చాకచక్యం: ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయాన్ని తెలుసుకున్న రైలు ఇంజిన్ డ్రైవర్ గోవిందరాజ్ వెంటనే రైలును ఆపాడు. దీంతో ఆరు బోగీలు మాత్రమే బోల్తా పడ్డాయి. లేకుంటే మొత్తం 24 బోగీలు ప్రమాదానికి గురయ్యేవని తెలసింది.  

 

క్షతగాత్రుల వివరాలు: జయశీలి జాకఫ్(కొట్టాయం), అబ్దుల్ రహమాన్(కొచ్చిన్), ప్రదీఫ్(తిరుచ్చూర్), జాకఫ్ పురువలా(తిరుప్పూర్), పావమ్మాల్ (తిరుప్పూర్), ఆనంద్ వ ల్లియం(కోయికేడు), జాక్ వల్లార్(బెంగళూరు), సర్వర్ బాషా(బెంగళూరు), రాణ (కొట్టాయం), ప్రకాష్(కొట్టాయం), బాలు (కొట్టాయం) వీరికి ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top