నీరు-పోరు

నీరు-పోరు

  • బళ్లారిలో మంచినీటి కోసం రోడ్డెక్కుతున్న కాలనీవాసులు

  •  ధర్నాలు, రాస్తారోకోలు నిత్యకృత్యం

  •  రిజర్వాయర్ నిండేవరకూ సహకరించాలంటున్న కమిషనర్

  •  సమస్య ఉన్న కాలనీలకు రోజుకు ఒక్క డ్రమ్ నీటి సరఫరా

  •  ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు

  • సాక్షి, బళ్లారి :  నగర సమీపంలోనే హెచ్‌ఎల్‌సీ కాలువలు వెళ్తున్నా బళ్లారి వాసుల దాహార్తి తీరడం లేదు. దీంతో గుక్కెడు నీటి కోసం అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు 4 లక్షలకుపైగా జనాభా ఉన్న బళ్లారికి మంచినీటిని అందించేందుకు తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీకి వారం రోజుల క్రితమే రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున  నీటిని విడుదల చేశారు.



    అయినప్పటికి కాలువ నుంచి రిజర్వాయర్‌కు నీటిని పంప్‌చేసి అక్కడినుంచి నగరానికి సరఫరా చేయడంలో కార్పొరేషన్ పాలకులు, అధికారులు దృష్టి పెట్టలేదు.ఫలితంగా రోజురోజుకు సమస్య జఠిలమవుతోంది. 35 వార్డుల్లోనూ ఏదో ఒక వార్డులో రోజు మంచినీటి కోసం ధర్నాలు, నిరసనలు, రాస్తారోకో, అధికారుల నిలదీత జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేటర్లు వార్డుల్లోని నీటి సమస్య తీర్చడంలో శ్రద్ధ చూపడం లేదని, ట్యాంకర్లు కొన్ని కాలనీలకే పంపుతున్నారని, మిగిలిన కాలనీలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

     

    నగర శివార్లలో సమస్య మరింత తీవ్రం

     

    నగర శివార్లలోని అల్లీపురం, వినాయక్‌నగర్ తదితర కాలనీల్లో నీటి సమస్య మరింత తీవ్రమైంది.అల్లీపురం పక్కనే రిజర్వాయర్ ఉన్నప్పటికి మంచినీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి ఒక డ్రమ్ నీరు మాత్రమే సరఫరా చేస్తుండటంతో ఆనీరు తమ అవసరాలకు సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరో వైపు ట్యాంకర్లు వచ్చినప్పుడు తోపులాట జరుగుతోంది.  ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి హెచ్‌ఎల్‌సీ నీటితో రిజర్వాయర్లు నింపి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

     

    నీటి కోసం కార్యాలయం ముట్టడి



    పక్షం రోజులుగా నీటిని సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ  బళ్లారిలోని సిద్ధార్థనగర్, శ్రీహరి కాలనీ, శ్రీకనకదుర్గమ్మ లేఅవుట్, బదిరీ నారాయణ దేవస్థానం సమీపంలోని ప్రాంతాలవాసులు బుధవారం ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా గాంధీనగర్ వాటర్ బూస్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయ తలుపులు మూసివేసి అక్కడే బైఠాయించి ధర్నా చేశారు.  స్థానిక కార్పొరేటర్ మల్లనగౌడ స్పందించి కమిషనర్ చిక్కణ్ణను అక్కడకే పిలిచించారు.



    ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ప్రతి నెల  పన్నులు చెల్లిస్తున్నా మంచినీరు సరఫరా చేయకపోవడంలో ఆంతర్యమేమిటని గంగాధర్ పత్తార్, హిరేమఠ్, మల్లేష్, తాయారు, పురుషోత్తంరెడ్డి, బాలరాజు తదితరులు కమిషనర్‌ను నిలదీశారు. 15 రోజులైనా నీరు సరఫరా చేయకపోవడంతో ఇళ్లు ఖాళీ చేసి బంధువులు ఇళ్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.



    నీటిని విడుదల చేసేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని బీష్మించుకుకూర్చున్నారు. కమిషనర్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం నుంచి అల్లీపురం, మోకా రిజర్వాయర్‌లోకి నీటిని పంప్ చేసేవరకు సమస్య ఉంటుందని, అంతవరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top