బాపు చిరంజీవి

బాపు చిరంజీవి


 ప్రఖ్యాత దర్శకుడు బాపు భౌతికంగా లేకపోయినా ఆయన కళాత్మక రూపాలు చిరంజీవిగా నిలిచిపోతాయి. బాపు చిత్రాలు చిరస్మరణీయంగాను, చిత్ర లేఖనాలు చిరస్మరణీయంగాను, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగాను ఉంటాయి. రామాయాణాన్ని పలు విధాలుగా సాంఘిక కథలుగా మలచి చిత్రాలుగా రూపొందించిన ఘనత బాపుకే దక్కుతుంది. నిరాడంబరుడు, నిగర్వి, సౌమ్యుడు, నిష్ణాతుడు అయిన బాపుకు పొగడ్తలంటే ఇష్టముండదు. అయినా ఆయన్ని పొగడని నోరుండదు. అలాంటి బాపు ఇప్పుడు మనముందు లేకపోవడం అత్యంత బాధాకరం. బాపు మృతికి పలువురు చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులంటూ పలువురు అశ్రు నివాళులర్పించారు. వీరిలో చిరంజీవి, బాలకృష్ణ, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సింగీతం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

 

 పాఠ్యాంశంగా సీతా కల్యాణం

 బాపులేరన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా రోజులు పడుతుందని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అన్నారు. ఆయనేమన్నారంటే.......నా తొలిచిత్రం నీతి నిజాయితీని ప్రత్యేకంగా చూసి చక్రపాణికి ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పారు. ఆ విషయం నాకు చెప్పలేదేమిటంటే నీ చిత్రం గురించి నీకు చెబుతామా? ఇతరులకు చెబుతాం గానీ అని అన్నారు. అంత గొప్ప వ్యక్తి బాపు. ఆయనతో 55 ఏళ్ల మైత్రి నాది. బాపు నాకొక పుస్తకం పోస్ట్ ద్వారా పంపారు. ఆ కవరుపై నా పేరు అందంగా రాశారు. నాకది చాలా నచ్చింది. వెంటనే బాపుకు ఫోన్ చేసి ఆ కవరుపై అడ్రసు రాసిన అక్షరాలు మీవేనా అని అడిగాను. నావేనన్నారు. ఆ అక్షరాలతో కూడిన నా పేరును నా లెటర్‌పేడ్‌పై వేయించుకోవడానికి మీ అనుమతి కావాలన్నాను. వెంటనే ఆయన మళ్లీ మీ పేరు రాసి పంపుతానని చెప్పి మరుసటి రోజే పంపారు. నా లెటర్ ప్యాడ్‌పై ఇప్పటికీ ఆయన రాసిన అక్షరాలలోనే నా పేరు ఉంటుంది. మరో విషయం బాపు దర్శకత్వం వహించిన సీతాకల్యాణం చిత్రం లండన్‌లోని కేంబ్రిడ్జి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో పాఠ్యాంశంగా కొనసాగుతోందని సింగీతం శ్రీనివాసరావు తెలిపారు.

 

 కళామతల్లి ముద్దు బిడ్డను కోల్పోయాం

 ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ బాపు భౌతిక కా యానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బాపులాంటి కళామతల్లి ముద్దు బిడ్డను కోల్పోయామన్నారు. తెలుగు జాతికిది తీరని లోటు. బాపుకు సంగీత జ్ఞానం మెం డు. ముఖ్యంగా వెస్ట్ మ్యూజిక్‌లో పట్టు ఎక్కువ. హిందుస్థానీ గజల్స్‌ను, మెలోడీ సంగీతాన్ని బాగా ఎంజాయ్ చేస్తా రు. సుందరకాండ చిత్రానికి బాపుతో కలిసి పని చేసే అదృష్టం నాకు లభించింది. ఆ సమయంలో పలు సలహాలిచ్చేవారు. నా సూచనలను పరిగణనలోకి తీసుకునేవారు. ఆయనతో పనిచేయడం చాలా మంచి అనుభవం. అలాంటి బాపు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు.

 

 బాపులేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు

 యలమంచిలి

 శ్రీరామరాజ్యం చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబా బాపు భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాపు మరణం రాష్ట్రానికి తీరని లోటు. బాపు నాకిష్టమయిన దర్శకుడు. శ్రీరామరాజ్యాన్ని చిత్రాన్ని నాకు ప్రసాదించి బాపు,రమణలు వెళ్లిపోయారు. ఎవర్నీ నొప్పించని గుణం ఉందని యలమంచిలి చెప్పారు.

 

 బాపు ఒక్కరే

 ఉత్తమ దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే బాపులేని లోటును మళ్లీ ఆయన మరో జన్మఎత్తి తీరాల్సి ఉంటుంది. బాపు ఆయన తొలి చిత్రం సాక్షితో నన్ను పబ్లిసిటీ డిజైనర్‌గా పరిచయం చేసి నా భవిష్యత్‌కు బాట వేశారు. అప్పటి నుంచి ఆయన సొంత చిత్రాలన్నింటికీ నేనే డిజైనర్‌గా పని చేశాను. బాపు, రమణలు తరచు మా ఇంటికి వచ్చి ముచ్చటించేవారు. నేను రాసిన సినిమా పోస్టల్ పుస్తకానికి తొలి పలుకులు రాస్తూ కళల మాంత్రికుడిగా బిరుదిచ్చారంటూ ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ పేర్కొన్నారు.

 

 కుటుంబ సమేతంగా చూసేవారు

 బాపు ముత్యాల ముగ్గులో సీతగా జీవించిన సంగీత కంటతడిపెట్టారు. నన్ను బాపు తన కుటుంబ సభ్యురాలిగా చూసుకునేవారు. షూటింగ్‌లో నటిననే భావనే ఉండేదికాదు. వందల సినిమాలు చేసినా నన్నిప్పటికీ బాపు బొమ్మగానే పిలుస్తారు. బాపులాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటిస్తానన్నది సందేహమే. అసలు ముత్యాల ముగ్గు చిత్రంలో నటించే అవకాశం రావడమే అదృష్టం. మేకప్ లేకుండా సహజ సిద్ధంగా సీత పాత్రలో నటించే నటి కోసం బాపు అన్వేషిస్తున్నారని తెలిసి ఒక ఫొటో గ్రాఫర్ ద్వారా నా ఫొటోలు ఆయనకు పంపించాను. నేను ఆ పాత్రకు నప్పుతానని ఎంపిక చేశారు అని నటి సంగీత తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

 

 తండ్రిలా ఆదరించారు

 పెళ్లి పుస్తకం ఫేమ్ దివ్యవాణి బాపు పార్థివ దేహం వద్ద కన్నీరుమున్నీరయ్యూరు. నన్ను తండ్రిలా ఆదరించారు. షూటింగ్‌లో కూడా అమ్మాయి అనే పిలిచేవారు. అలాంటి బాపు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో జీవించే ఉంటారు. పెళ్లి పుస్తకం చేసేటప్పుడు నా వయసు 17 ఏళ్లే. బాపు చెప్పినట్లు చేశాను. ఆయన వేసిన బొమ్మతో  ఒక్క శాతం కనిపించినా చాలు అంత పేరు వస్తుంది. నిరాడంబరత అంటే ఏమిటో బాపు నుంచే నేర్చుకున్నాను అన్నారు నటి దివ్యవాణి.

 

 ఆ అదృష్టం నాకు దక్కింది

 బాపు దర్శకత్వంలో రాంబంటు చిత్రంలో నటించే గొప్ప అదృష్టం నాకు దక్కిందని నటి ఈశ్వరిరావు అన్నారు. ఇప్పటికీ రాంబంటు నాయకి బాపు బొమ్మ అనే నన్ను పిలుస్తారని అలాంటి మహానుభావుడు లేని లోటు ఎవరు తీర్చలేనిది అన్నారు నటి ఈశ్వరిరావు.

 

 బాపు చిత్రాలు కళాఖండాలు

 బాపు చిత్రాలు అద్భుత కళాఖండాలుగా నిలిచిపోతాయని నటుడు భానుచందర్ పేర్కొన్నారు. బాపు దర్శకత్వంలో మూడు చిత్రాలు చేశాను. అందులోనూ మనవూరి పాండవులు ఒకటి. ఆ చిత్రానికి నా గురువు బాలుమహేంద్ర ఛాయాగ్రహణం అందించారు. బాపు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన నాకు చెప్పేవారు. బాపు దర్శకత్వంలో పని చేస్తుంటే అసలు పని చేసినట్లే ఉండదన్నారు. నటుడు భానుచందర్.

 

 ఆయనకంటే తెలిసిన వారుండరు  

 50 ఏళ్ల క్రితం ముంబయిలో బాపును తొలిసారిగా కలిశానని ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకుడు వి.ఎ.కె.రంగారావు తెలిపారు. ఆయన బావమరిది ద్వారా పరిచయం అయ్యింది. నాకు తెలిసి హిందుస్థానీ సంగీతంలో బాపుకు తెలిసినంత ఎవరికీ తెలియదన్నారు.

 

 బాపు ప్రస్తానాన్ని  మరొకరు అందుకోవడం కష్టం  

 శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ తరపున 2005లో బాపుకు కళాప్రపూర్ణ బిరుదును నా చేతుల మీదగా అందించడం సంతోషంగా ఉందని ఆ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అందాలరాముడు, సీతాకల్యాణం అద్భుత సినీ కావ్యాలెన్నో చూసి నేనాయన అభిమానినయ్యాను. అలాగే ఎన్నో కళా చిత్రాలకు ప్రాణం పోసిన ఆయన కుంచె ఆగిపోవడం ఆవేదనకు గురిచేసింది. బాపు ప్రస్థానాన్ని మరొకరు అందుకోవడం కష్టం అని అన్నారు. ఇంకా నటుడు శరత్‌బాబు, సి.ఎం.కె.రెడ్డి, ఎస్పీబీ చరణ్, కార్టూనిస్టు జయదేవ్, నృత్యదర్శకుడు శీను, నటి ప్రభ, రాజ్యలక్ష్మి, రచయిత భారవి వంటి ప్రముఖులు బాపుకు నివాళులర్పించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top