బ్యాంకర్ల బెంబేలు


సాక్షి ప్రతినిధి, ఏలూరు : సీబీఐ కేసులతో బ్యాంకు అధికారుల్లో వణుకు మొదలైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత మూడు రోజులపాటు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించి కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో చిక్కుకున్న వారంతా తణుకు పరిధిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాదారులే. అయితే, జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున నల్లధనాన్ని మార్పిడి చేశారు. వీరిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకునే ప్రయత్నం మొదలు కాలేదు. తణుకు కేంద్రంగా ఇద్దరు ఎమ్మెల్యేలు నల్లధనాన్ని తెలుపు చేశారన్న పక్కా ఆధారాలు సీబీఐ వద్ద ఉన్నా.. వాటిపై దృష్టి పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

జిల్లాలోని ప్రజాప్రతి నిధులు వివిధ మార్గాల్లో నల్లధనాన్ని మార్చగా, ఎక్కువ మంది బ్యాంకర్ల ద్వారా కమీషన్‌ పద్ధతిలో మార్పిడి చేసినట్టు ప్రచారం సాగుతోంది. తాడేపల్లిగూడెంలో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత తన అనుచరులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారి ద్వారా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. యూనియన్‌ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లలో పెద్ద మొత్తంలో సొమ్ములను డిపాజిట్టు చేయించారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని, ఇంటికి రూ.లక్ష నుంచి రూ. 2.50 లక్షల వరకు పాత నోట్లను ఇచ్చారు. వీటిని మూడు బ్యాంకుల్లో జనధన్‌ ఖాతాలకు, డ్వాక్రా ఖాతాలకు, సేవింగ్స్‌ ఖాతాలకు మళ్లించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో దీనిపైనా సీబీఐ దృష్టి పెట్టినట్టు సమాచారం.

 

ఎస్‌బీఐ, ఇతర ప్రధాన బ్యాంకులతోపాటు పలు ప్రైవేటు బ్యాంకుల అధికారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని సొమ్మును తెలుపు చేసుకోగలిగారు. ఇదిలావుంటే.. పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించింది. తణుకు ఎస్‌బీఐ కేంద్రంగా జరిగిన అక్రమ లావాదేవీలు తాజాగా వెలుగు చూడటంతో ఇందుకు సహకరించిన అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కేవీ కృష్ణారావుపై ఆర్‌బీఐ అధికారులు వేటు వేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో ఒకే రోజు రూ.2.49 కోట్లు విత్‌డ్రాకు సహకరించిన బ్యాంకు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. వీరితోపాటు తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన  వ్యాపారుల పైనా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల తణుకు పట్టణంలో కొందరు వ్యాపారులు, బిల్డర్లతోపాటు బ్యాంకు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్దఎత్తున అక్రమాలు గుర్తించినట్టు సమాచారం. అంతేకాకుండా వీరి నుంచి కీలక డాక్యుమెంట్లు సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా ఆర్‌బీఐ, సీబీఐ అధికారులు జిల్లావ్యాప్తంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో తమ వ్యవహారాలు బయటకు పొక్కకుండా పలువురు ప్రజాప్రతినిధులు జాగ్రత్త పడుతుండగా.. ఎటుతిరిగి ఎటు వస్తుందోనని జిల్లాలోని బ్యాంకుల అధికారుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top