కరుణానిధి ఎవరికో?

కరుణానిధి ఎవరికో? - Sakshi


 ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో ప్రయాసలు పడుతున్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు..  రాష్ట్ర పార్టీలతో పొత్తు కోసం తహతహలాడుతున్నాయి. ఏ పార్టీని ఎవరు తన్నుకుపోతారోననే పోటీ నెలకొనడంతో కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.                   

 

 చెన్నై, సాక్షి ప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తుండడంతో తమిళనాట రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలతో పొత్తులేనిదే జాతీయ పార్టీలకు రాష్ట్రంలో మనుగడ లేదు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తాను కామరాజర్ హయాం తరువాత కాంగ్రెస్ కోల్పోయింది. డీఎంకే, అన్నాడీఎంకేలలో ఏదో ఒక పార్టీతో పొత్తుకుదుర్చుకుని పోటీకి దిగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకేల మధ్య స్నేహం కుదరగా ఇరు పార్టీలూ కలిసి రెండు విడతల అధికారాన్ని అనుభవించాయి. అయితే ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ స్నేహానికి కరుణానిధి కటీఫ్ చెప్పేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను డీఎంకే దరిచేరనీయలేదు. ఫలితంగా రెండుపార్టీలూ డిపాజిట్లు కోల్పోయి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి.

 

 ఈ తప్పిదం అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా కొనసాగరాదని కాంగ్రెస్, డీఎంకేలు భావిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూపీఏలో చేరిన డీఎంకేపై ఈసారి కమలనాథులు కన్నేశారు. ఎన్‌డీఏ కూటమిలో డీఎంకేను చేర్చుకోవడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు సులువు కాగలదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుకు బీజేపీ ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు డీఎంకే చుట్టూ తిరుగుతోంది. మరోవైపు డీఎండీకేను ఎలాగైనా డీఎంకే కూటమిలోకి తీసుకుని బీజేపీతో పొత్తుకు ఆలోచించాలని కరుణ భావిస్తున్నట్లు సమాచారం.

 

 రాష్ట్రంలోని రెండు ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేల చుట్టూ రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) తిరుగుతున్నాయి. డీఎంకే, డీఎండీకే, కాంగ్రెసా లేక డీఎంకే, డీఎండీ కే, బీజేపీ కూటమా అనే విషయంలో గందరగోళం నెలకొని ఉంది. డీఎండీకే, డీఎంకేలతో కూటమి ఏర్పాటు చేయాలని బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్‌ను ఖంగుతినిపించాయి. డీఎంకేతో కూటమి ఏర్పా టు చేయబోయేది కాంగ్రెస్సా, బీజేపీనా అనే ఉత్కంఠ మొదలైంది. డీఎండీకేను ఎరవేసి డీఎంకేను తమ జట్టులోకి లాక్కోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కూటమిలో ఉండిన డీఎండీకే ప్రస్తుతం తటస్థంగా ఉంది. బీజేపీవైపుకు తిప్పుకోవడం కోసం బీజే పీ రహస్య మంతనాలు సాగిస్తోంది. విజయకాంత్ బావమరిది సుదీష్‌తో ఢిల్లీలో చర్చలు జరిపిన అమిత్‌షా తుది ప్రకటన కోసం వేచి ఉన్నారు. పదిశాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్న డీఎండీకేను డీఎంకే కూటమిలో చేర్చేబాధ్యతలను కరుణ కాంగ్రెస్‌పై పెట్టినట్లు రహస్య సమాచారం.

 

 15, 17 తేదీల్లో ఆజాద్, అమిత్‌షా రాక

 పొత్తు రాజకీయాలు డీఎంకే చుట్టూ పరిభ్రమిస్తుండగా, కరుణానిధి కరుణ కోసం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ చెన్నైకి వస్తున్నారు. ఈనెల 17వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ కుమారుని పెళ్లి చెన్నైలో జరుగనుంది. డీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్న తమిళిసై ఇదే అదనుగా పెళ్లి ఆహ్వానం నెపంతో మంగళవారం కరుణానిధిని కలుసుకున్నారు. పెళ్లికి హాజరయ్యేలా మాటతీసుకున్నారు.

 

  పెళ్లి వేడుకలకు అమిత్‌షా కూడా హాజరవుతుండగా ఇదే అదనుగా అమిత్‌షా, కరుణల మధ్య చర్చలు సాగేలా సన్నాహాలు చేస్తున్నారు. కమలనాథుల వ్యూహాన్ని కనిపెట్టిన కాంగ్రెస్ పెళ్లికి రెండురోజుల ముందే అంటే 15వ తేదీనే ఆజాద్‌ను చెన్నైకి పంపుతోంది. బీజేపీ కంటే ముందుగానే కరుణానిధి నుండి పొత్తుపై హామీ తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.డీఎంకేతో గతంలో పొత్తుకుదిర్చిన అనుభవం ఉన్న ఆజాద్‌నే మరోసారి పంపుతోంది.పొత్తుకు షరతులు ః డీఎంకే : మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 150 స్థానాల నుంచి పోటీచేసి మిగిలిన స్థానాలను కూటమి పార్టీలకు కేటాయించాలని భావిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని దారపోసే భావన ఎంతమాత్రం లేదు. అలాగే కూటమి ప్రభుత్వం అనే ముద్ర పడటం కూడా ఇష్టం లేదు.

 

 డీఎండీకే : గత అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల నుండి పోటీచేయగా, ఈసారి కనీసం వంద స్థానాలకు పట్టుపడుతోంది. కనీసం 60 నుండి 70 స్థానాల నుండైనా పోటీచేయాలని కృతనిశ్చయంతో ఉంది. అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి కావాలనే నిబంధన విధించి ఉంది.


 బీజేపీ : బలమైన కూటమిని ఏర్పాటు చేయ డం లేదా అటువంటి కూటమిలో చేరడం..ఏదో ఒకటి జరగాలని భావిస్తోంది. కనీసం 30 స్థానాలు ఇస్తే సరిపోతుందని చెబుతోంది.కాంగ్రెస్ డీఎంకేతో కూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. 2011 ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ 63 స్థానాల నుండి పోటీకి దిగింది. అయితే ఈసారి కనీసం 20 స్థానాలైనా దక్కుతాయా అనే అనుమానంతో ఉంది. ఇటువంటి దయనీయ పరిస్థితిలో కూటమిలో చేరేందుకు ఎటువంటి నిబంధన పెట్టలేదు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top