ముఖంమీద ఉమ్మి, అసభ్యంగా దూషించాడు

ముఖంమీద ఉమ్మి, అసభ్యంగా దూషించాడు - Sakshi


ఓ మహిళా సాప్ట్వేర్ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వయంగా నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి జోక్యం చేసుకుని చర్యలకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కోల్‌కతాకు చెందిన రీనా బిస్వాస్ అలియాస్ రాణి బెంగళూరులో ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తోంది. ఈనెల 18న రాత్రి 11 గంటల సమయంలో ఆమె విధులు ముగించుకుని ఆటోలో మడివాళలోని ఇంటికి బయలుదేరింది.



కొద్ది దూరం అనంతరం మారుతినగర్‌లో ఆటో ఆపేసిన డ్రైవర్, మీటర్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇంత రాత్రివేళలో అక్కడినుంచి ఇంటివరకు నడిచి వెళ్లడం ప్రమాదమని చెప్పినా అతను డ్రాప్ చేయడానికి నిరాకరించాడు.  దాంతో డబ్బులు చెల్లించే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన డ్రైవర్ ...రీనాను ఆటోలో నుంచి బయటకు లాగిపడేశాడు. దీంతో ఆమె స్వల్పంగా గాయపడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని ఇద్దరికి సర్ది చెప్పారు.



అనంతరం రీనా ఈ ఘటనపై మడివాళ పోలీస్ కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంటికి వచ్చి ఫేస్‌బుక్‌లో ఆటో ఫొటో పెట్టి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. ఆటో డ్రైవర్ తన ముఖం మీద ఉమ్మటంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించింది.  విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని మడివాళ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన  పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top