ఆటోవాలాలపై ఆప్ నజర్

ఆటోవాలాలపై ఆప్ నజర్ - Sakshi


 సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సూచనలు ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్  ప్రజాదరణను చూరగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదని, తమ శక్తిసామర్థ్యాలన్నీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే  కేంద్రీకరించాలని  నిర్ణయించారు. ఢిల్లీలో కోల్పోయిన జనాదరణను చూరగొనేందుకు ఈ పార్టీ అనేక ప్రయత్నాలు చేపట్టింది. సర్వే జరిపించి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేసినవారు, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటేశారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడెక్కడ ఆదరణ పలుచబడిందో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టిమళ్లీ మద్దతు చూరగొనాలని భావిస్తోంది. ఈ ప్రయత్నాల్లో  భాగంగానే ఆటోవాలాలను మళ్లీ తన వైపుకు  తిప్పుకోవాలనుకుంటోంది. ఆటో డ్రైవర్లను ఈ ఉద్దేశంతో పార్టీ వచ్చే వారం ఆటోడ్రైవర్లతో భారీ సభ ఏర్పాటు చే యాలని నిర్ణయించింది.

 

 పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆటోవాలాలు ఆప్‌కు భారీగా మద్దతు ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆటోవాలాల కోసం అనేక చర్యలు ప్రకటించారు. వీటిలో కొన్ని మాత్రమే అమలుకాగా, చాలామటుకు మాటలకే పరిమితమయ్యాయి. ఆప్ తమను వాడుకుని వదిలివేసిందన్న అభిప్రాయం చాలామంది ఆటోవాలాలకు కలిగింది. పలువురు ఆటోవాలాలు కేజ్రీవాల్‌పైనా, ఆప్‌పైనా ఇంకా ఆగ్రహంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఓ ఆటోవాలా కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కూడా కొట్టాడు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆటోవాలాల మద్దతు పొందడానికి ఈ నెల 31న రామ్‌లీలా మైదాన్‌లో ఆటోవాలాలతో భారీ బహిరంగ సభ జరపాలని ఆప్ యోచిస్తోంది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top