ఆత్మకూరులో తమ్ముళ్ల అలక ...!

ఆత్మకూరులో తమ్ముళ్ల అలక ...! - Sakshi

నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నియోజకవర్గంలో ఆనం వర్గీయులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ నియామకంపై ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు మోసిన గూటూరు కన్నబాబు అలిగి మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నారు. ఆయనకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించబోతున్నారని జూన్‌ 3 వతేదీ  ‘ఆనం కుటుంబానికి ఆత్మకూరు, నెల్లూరు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది.



వైఎస్సార్‌ సీపీ బలాన్ని తట్టుకోలేక..

ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిని ఎదుర్కోవడం కన్నబాబు వల్ల కాదని పార్టీ అధిష్టానం చాలాకాలం కిందటే ఒక అభిప్రాయానికి వచ్చింది. నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ బలం తగ్గించక పోతే రాబోయే ఎన్నికల్లో కూడా ఈ సీటు కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకుని వచ్చి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఆయనకు టీడీపీ తీర్థం ఇచ్చారు. ఆయన రాకను కన్నబాబు తీవ్రం గా వ్యతిరేకించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిం ది. అయితే పరిస్థితులన్నీ సర్దుబాటు చేశాకే రామనారాయణరెడ్డిని అధికారికంగా రంగంలోకి దించాలని పార్టీ అధిష్టానవర్గం భావించింది.



కన్నబాబుతో పార్టీ పెద్దలు అనేక సార్లు చర్చించినా రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పని చేయడానికి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆనం, కన్నబాబు వర్గాల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరలేదు. తనకు అధికారి కంగా బాధ్యతలు ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి వెళ్లబోనని రామనారాయణరెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక పార్టీ ని బలపరచుకోవడం మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో ఇటీవల సీఎం ఈ విషయం గురించి  చర్చించారు. ఆనంకు అధికారికంగా బాధ్యతలు అప్పగిస్తూ వారం రోజుల ముందే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు.



మంగళవారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి కన్నబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నందువల్ల తర్వాత ఉత్తర్వులు ఇద్దామని రవిచంద్ర సూచించారు. మంగళవారం కన్నబాబు పుట్టిన రోజు వేడుకలు ముగియడంతో బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రామనారాయణరెడ్డిని ఇన్‌చార్‌్జగా నియమించారనే సమాచారం తెలియడంతో బుధవారం ఉదయం నుంచి కన్నబాబు, ఆయన ముఖ్య అనుచరులు సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకున్నారు. మరోవైపు రామనారాయణరెడ్డి మద్దతుదారులు ఆత్మకూరు నియోజకవర్గంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.



కన్నబాబుకు పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఉన్న పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు జిల్లా పార్టీ నాయకత్వం ఆయన్ను బుజ్జగించే పనిలో పడింది. నెల్లూరులో ఇటీవల నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో తాము కన్నబాబు మాట వినాలా? ఆనం రామనారాయణరెడ్డి మాట వినాలా? అని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శిద్ధా రాఘవరావును అడిగామని, ఆయన కన్నబాబు మాటే వినాలని చెప్పారని గూటూరు మద్దతు దారులు చెబుతున్నారు. ఇప్పుడు రామనారాయణరెడ్డిని తమ నియోజకవర్గ బాధ్యుడిగా నియమిస్తే ఆయనతో ఎలా కలిసి పనిచేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top