ఒక్కతాటిపైకి ప్రతిపక్షాలు!

ఒక్కతాటిపైకి ప్రతిపక్షాలు! - Sakshi


రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం కసరత్తు

►  ప్రాంతీయ పార్టీల ఐక్యతకు పిలుపునిచ్చిన లాలూ, మమత, ఏచూరి




న్యూఢిల్లీ/కోల్‌కతా/పట్నా: యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికల్ని దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో చేతులు కలిపేందుకు ప్రతిపక్ష పార్టీలు  సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాతో బిహార్‌ సీఎం నితీశ్‌ చర్చించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సోనియాతో చర్చించారు. భేటీ అనంతరం ఏచూరి మాట్లాడుతూ.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అన్ని లౌకిక ప్రతిపక్ష పార్టీలు చర్చలు జరుపుతున్నాయన్నారు.


ప్రతిపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలిపే అవకాశంపై ఏచూరి, సోనియాలు చర్చించారని, ఈ ప్రతిపాదనకు సోనియాగాంధీ సానుకూలంగా స్పందించారని సీపీఎం వర్గాలు వెల్లడించాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో  సీపీఎం పార్టీ సంప్రదింపులు కొనసాగిస్తోంది. జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి గురువారం మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి ఎన్నికల్లో బలమైన ఉమ్మడి అభ్యర్థి నిలపాలని జేడీయూ కూడా భావిస్తున్నట్లు చెప్పారు.



2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా అవసరం: లాలూ

బిహార్‌ ఆర్జేడీ అధినేత లాలూ పట్నాలో శుక్రవారం మాట్లాడుతూ...  2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మహాఘట్బంధన్‌ పేరిట ఆర్జేడీ–జేడీయూల పొత్తు తరహాలోనే ప్రస్తుతం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందన్నారు.   మతతత్వ, ఫాసిస్టు శక్తుల్ని ఓడించేందుకు మాయావతి, కాంగ్రెస్, మమతా బెనర్జీ, అఖిలేశ్‌లు ముందుకు రావాలన్నారు.



ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలి:

బీజేపీని వ్యతిరేకిస్తే వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని శుక్రవారం కోల్‌కతాలో సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కటవ్వాలని కార్యకర్తల్ని ఉద్దేశించి మమత ప్రసంగించారు. కలిసికట్టుగా, ఐక్యంగా సాగాలని అన్ని పార్టీలను కోరుతున్నానని, తృణమూల్‌ పార్టీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.



చర్చించాకే నిర్ణయం: కాంగ్రెస్‌

భాగస్వామ్య పార్టీలతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు, వర్కింగ్‌ కమిటీలు చర్చించాకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై సరైన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.  నిర్ణయం తీసుకోగానే మీడియాకు వెల్లడిస్తామంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top