పేదల మనసులు గెలవాలి

పేదల మనసులు గెలవాలి - Sakshi


కేంద్రప్రభుత్వ పథకాల అమల్లో ఆదర్శంగా నిలవాలి

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ సూచన

పేదల సంక్షేమ అజెండా కోసం పార్టీ కమిటీ ఏర్పాటు


న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పేదల మనసులు గెలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేం చేయాలనే దానిపై బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, బీజేపీ రాష్ట్రాల అధ్యక్షుల సమావేశంలో మార్గదర్శనం చేశారు. పథకాల అమలును వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కూడా మోదీ గుర్తుచేశారు. ఒకదాని తర్వాత మరో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలనుకోవటం సరికాదని.. ఒకేసారి వివిధ కార్యక్రమాలను సమానమైన వేగంతో పూర్తి చేయాలని సూచించారు. పేదల సంక్షేమ ఎజెండాను రూపొందించేందుకు పార్టీ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేశారు.


మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్‌ల సీఎంలతోపాటు పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధేల కమిటీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదల సంక్షేమం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎజెండాను సిద్ధం చేస్తుంది. ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన పథకాలనూ గుర్తిస్తుంది. ‘శనివారం దినమంతా జరిగిన ఈ భేటీలో.. సంక్షేమం, పేదలు, రైతుల, మహిళా సాధికారత, యువత, ఉపాధి కల్పన, సుపరిపాలన వంటి అంశాలపైనే ప్రధానంగా చర్చించాం’ అని సమావేశం తర్వాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.


మోదీ ప్రభుత్వం.. ముస్లింలు, దళితులకు వ్యతిరేకి అంటూ విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలను పకడ్బందీగా, సమర్థవంతంగా అమలు చేయాలని.. వీటి ఫలాలను పేదలకు చేరేలా జాగ్రత్త వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు సమావేశంలో ముఖ్యమంత్రులు.. వారి ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సుపరిపాలన, అభివృద్ధి, పేదల అనుకూల నిర్ణయాల ద్వారా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించారు. రియోలో పతకాలు సాధించిన ఇద్దరు మహిళా క్రీడాకారులను సమావేశంలో అభినందించారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సమావేశం ఏర్పాటుచేయటం ఇదే తొలిసారి.


మోదీకి పేరొస్తుందనే..: వెంకయ్య

సాక్షి, న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంతగా కేంద్రం పేదల కోసం లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే విపక్షాలు అర్థరహితమైన విమర్శలు చేస్తున్నాయని వెంకయ్యనాయుడు విమర్శించారు.  సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మన దేశంలో, కొందరు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తారు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయితే.. మోదీకి, బీజేపీకి పేరొస్తుందనే.. కొందరు ఈ పథకాలను విమర్శిస్తున్నారు’ అని అన్నారు. పేదలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అయితే.. వారు పేదలుగానే ఉండాలని మన రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే.. రాజకీయ ప్రత్యర్థులు మోదీ ప్రభుత్వం ధనికులకు అనుకూలమని, పేదలకు వ్యతిరేకమని ప్రచారం చేసేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారన్నారు. ఐడియాలజీ, ఆర్గనైజేషన్, నాయకత్వమే బీజేపీ విజయానికి కారణాలని అని పేర్కొంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు నాయకత్వం ప్రాతిపదికపైనే జరుగుతాయన్నారు.


పథకాల అమల్లో రాష్ట్రాలే కీలకం: అమిత్ షా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 80 పథకాల్లో 65కు పైగా పేదల కోసం ఉద్దేశించినవేనని.. అవి సమర్థవంతంగా అమలుకావటంలో రాష్ట్రాల పాత్రే చాలా కీలకమని ఈ సందర్భంగా సమావేశం ప్రారంభోపన్యాసంలో అమిత్ షా తెలిపారు. ఓటు బ్యాంకు కోసం ప్రయత్నించకుండా కేవలం అభివృద్ధి ఎజెండానే నమ్ముకుని కేంద్రం పనిచేస్తోందని.. అదే బాటలో రాష్ట్రాలూ ముందుకెళ్లాలన్నారు. ‘కేంద్ర పథకాలు సమర్థవంతంగా అమలు కావాలని షా చెప్పారు. అన్ని రాష్ట్రాలు ఇప్పటివరకు ఏం చేశాయి.


ఇకపై ఏం చేస్తాయనే దానిపై ప్రజెంటేషన్లు ఇచ్చాయి. మరీ ముఖ్యంగా వ్యవసాయం, మహిళాసాధికారత, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు ఉపాధి కల్పన, విద్య, వైద్యం వంటి అంశాలపై చాలా సేపు చర్చ జరిగింది’ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే తప్ప మిగిలిన వారంతా హాజరయ్యారని.. ఆమె తరపున సీనియర్ మంత్రి సమావేశానికి హాజరయ్యారని ఫడ్నవిస్ అన్నారు. సమాచార సాంకేతికతను రాష్ట్ర ప్రభుత్వాలు విరివిగా వినియోగించటంపైనా చర్చించినట్లు తెలిపారు

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top