ఎయిర్పోర్ట్లో అమెరికా యువతి అరెస్ట్

ఎయిర్పోర్ట్లో అమెరికా యువతి అరెస్ట్ - Sakshi


చెన్నై: అనుమానాస్పద స్థితిలో ఢిల్లీకి ప్రయాణమవుతున్న అమెరికాకు చెందిన మార్గరెట్ ఎలిజిబెత్ (26)ను చెన్నై విమానాశ్రయ అధికారులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి 9.30 గంటలకు చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరే జెట్ ఎయిర్‌వేస్ విమాన ప్రయాణికులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా ఆమె చేతి బ్యాగ్‌లోని రహస్య అరలో నిషేధిత శాటిలైట్ ఫోన్ బయటపడింది. దేశ రక్షణశాఖలోని భద్రతాధికారులు మాత్రమే ఇటువంటి శాటిలైట్ ఫోన్లను వినియోగించాలి. సాధారణ పౌరుల వినియోగంపై నిషేధం అమలులో ఉంది. దీంతో ఆమె ప్రయాణాన్ని రద్దుచేసి అదుపులోకి తీసుకున్నారు. 


పర్యాటక వీసాపై ఈనెల 18న చెన్నైకి వచ్చి వేలాచ్చేరిలోని ఒక స్టార్ హోటల్లో ఆమె బసచేసింది. ఇటీవలే తిరుపతికి వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది. చికాగోలోని ఒక యూనివర్సిటీలో తాను అధ్యాపకురాలిగా పనిచేస్తున్నానని, తనతోపాటు ఈ శాటిలై ట్ ఫోన్‌ను తెచ్చుకున్నానని ఆమె వాదిస్తోంది. ఇదే నిజమైతే అమెరికా నుంచి చెన్నైలో దిగగానే విజిలెన్స్ తనిఖీల్లో బయటపడి ఆరోజే ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. 


తీవ్రవాదులు, ఇతర దేశాలకు చెందిన గూఢచారులు శాటిలైట్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. విచారణలో ఆ యువతి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అమెరికా గూఢచారిగా అనుమానిస్తున్నారు. ఈ ఫోన్ ద్వారా ఎవరెవరితో మాట్లాడింది, ఏదైనా ఫొటోలు తీసిందా అని ఆరాతీస్తున్నారు. మార్గరెట్ ఎలిజిబెత్ వ్యహారాన్ని భారత రక్షణ శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం, క్యూ బ్రాంచి పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top