ఆర్కే ఎక్కడ?

ఆర్కే ఎక్కడ? - Sakshi


క్షేమంగానే ఉన్నారా.. ఉంటే ఎక్కడ ఉన్నట్లు!

కొడుకు, గన్‌మెన్‌లు ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత

ఆర్కేపోలీసుల అదుపులోనే ఉన్నారంటున్న వరవరరావు 


సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్.. రోజురోజుకీ పెరుగుతున్న మావోల మృతుల సంఖ్య.. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే ఆచూకీపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌కే పోలీసుల అదుపులో ఉన్నారా?.. తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారా?.. అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏవోబీలో వరుసగా ఐదురోజుల్లో మూడు ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పోలీసులు చెప్పడం, ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని ప్రకటిస్తుండటంతో ఖాకీ వ్యూహం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు.



వందలు దాటి ఇప్పుడు వేలాదిమంది పోలీసులు ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఆర్కే లక్ష్యంగానే పోలీసులు భారీగా కూంబింగ్ చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ ఘటన నుంచి ఆర్కే తప్పించుకున్నారని గత నాలుగు రోజులుగా వినిపిస్తున్న వాదనలకు భిన్నంగా విరసం నేత వరవరరావు ప్రకటన చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని, వెంటనే ఆయన్ని కోర్టులో హాజరుపరచాలని వరవరరావు గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఐదురోజులైనా ఆర్కే క్షేమంగా ఉన్నట్టు ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం ఆందోళన రేకిత్తిస్తోంది.



హెలికాప్టర్లతో జల్లెడ...

మరో పక్క పోలీసు అధికారులు మాత్రం ఆర్కే తమ అదుపులో లేరని చెబుతున్నారు. గాలింపు చర్యలు మాత్రం తీవ్రతరం చేశామని అంగీకరిస్తున్నారు. సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు కూడా హెలికాప్టర్లను వినియోగించని పోలీసులు.. గత రెండు రోజులుగా హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేస్తున్నారు. బలిమెల బ్యాక్ వాటర్ ప్రాంతంలో కూడా నిఘా పెంచారు. గాయాలపాలైన ఆర్కేకు ఆర్‌ఎంపీ లేదా ఇతర ప్రైవేటు వైద్యుల సేవలు అందకుండా చర్య లు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏజెన్సీలోని వైద్యులపై ఆంక్షలు విధిస్తున్నారు.



ఏవోబీలో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆర్కేను అంతమొందిస్తే పార్టీ పూర్తిగా నిర్వీర్యమవుతుందన్న అంచనాతోనే పోలీసులు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే అడవిలోనే సురక్షితంగా ఉన్నాడా, తీవ్రగాయాలతో ఇబ్బందులు పడుతున్నాడా, పౌరహక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నట్టు పోలీసుల చెరలో ఉన్నాడా అనేది అంతుబట్టకుండా ఉంది.

 

ఆ మందులు అతనికేనా!

గురువారం విశాఖ జిల్లా సిర్లిమెట్ట వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందగా, వారి నుంచి కొన్ని మందులు(ఇంజక్షన్లు, మాత్రలను) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చూపించారు. ఆ మందులు అనారోగ్యంతో ఉన్న ఆర్కే కోసమేనా.. అన్న వాదనలు తెరపైకి వచ్చాయి. సోమవారం పోలీసుల కాల్పుల్లో ఆర్కేకి కూడా తీవ్రగాయాలు అయ్యాయని, దీంతో ఆయన్ను కొందరు దళ సభ్యులు సంఘటన ప్రాంతం నుంచి మోసుకువెళ్లి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం సిర్లిమెట్ట వద్ద మావోలు పోలీసులకు చిక్కి ఉంటారన్న ప్రచారం సాగుతోంది. ఈ కోణంలోనే పౌరహక్కుల సంఘాల నేతలు, విరసం నేత వరవరరావు

తదితరులు ఆర్కే కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు అనుమానిస్తున్నారని అంటున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top