మళ్లీ ‘సిద్దిపేట టు ముంబై ’ బస్సు


- పునరుద్ధరించిన టీఎస్‌ఆర్టీసీ

- హర్షం వ్యక్తంచేసిన తెలుగు ప్రజలు

- తెలంగాణ ముంబై మధ్య 8 బస్సులు


సాక్షి, ముంబై: ముంబైలోని తెలంగాణ ప్రజలకోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) సిద్దిపేట బస్సును పునరుద్ధరించింది. గజ్వెల్-ప్రజ్ఞాపుర్ డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్సును సిద్దిపేట, హైదరాబాద్‌ల మీదుగా ముంబైకి తిరిగి ప్రారంభించారు. దీనిపై తెలుగు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, సిద్దిపేట నుంచి గురువారం, ముంబై నుంచి శుక్రవారం బస్సు ప్రారంభమైంది. గతంలో మాదిరిగానే బోరివలి, దహిసర్, ఠాణే, పన్వెల్, పుణే, షోలాపూర్, జహీరాబాద్, హైదరాబాద్‌ల మీదుగా బస్సు సిద్దిపేటకు చేరుకుంటుంది.



మూడు నెలల కిందట వివిధ కారణాల వల్ల ముంబై-సిద్దిపేట ఆర్‌టీసీ బస్సును నిలిపివేశారు. దీంతో ఓ వైపు రైళ్లలో టిక్కెట్లు లభించకపోవడం, మరోవైపు బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ బస్సును మళ్లీ పునరుద్ధరించడంపై ముఖ్యంగా ముంబైలో నివసించే సిద్దిపేట, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.



వేసవి సెలవులకు ముందే ఈ బస్సు ప్రారంభం కావడంతో స్వగ్రామాలకు వెళ్లాలనుకునే అనేక మందికి బస్సు ఊరటగా మారనుందని చెప్పవచ్చు. ఇకపై ఈ బస్సు ప్రతి రోజు నడుస్తుందని టీఎస్‌ఆర్‌టీసీ ముంబై అధికారి బి. లక్ష్మయ్య తెలిపారు. మరోవైపు ఠాణే నుంచి వనపర్తి బస్సును కుర్లా నుంచి ఇటీవలే ప్రారంభించినట్టు చెప్పారు. ఈ బస్సు కూడా ముందు కుర్లా అనంతరం ఠాణే, పన్వెల్‌ల మీదుగా వనపర్తికి వెళ్తుందని ఆయన చెప్పారు.

 

ముంబై నుంచి తెలంగాణకు ఎనిమిది బస్సులు

ముంబై నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వివిధప్రాంతాలకు ప్రస్తుతం ఎనిమిది టీఎస్‌ఆర్‌టీసీ బస్సులు నడుస్తున్నాయి. గతంలో ఈ సంఖ్య దాదాపు మూడింతలు ఉండేది. పరెల్, కుర్లా, గోరేగావ్, బోరివలి, ఠాణే, భివండీ తదితర ప్రాంతాల నుంచి సుమారు 20 కిపైగా బస్సులు నడిచేవి. కేవలం పనెల్ నుంచి ఎనిమిది బస్సులు నడిచేవి. అయితే గత కొన్ని సంవత్సారాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా టిక్కెట్ చార్జీల పెరగడం, ఇతర కారణాల వల్ల అనేక బస్సు సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం కుర్లా నుంచి నాలుగు, బోరివలి నుంచి రెండు, గోరేగావ్, పరెల్ నుంచి ఒక్కో బస్సు నడుస్తోంది.



వీటిలో కుర్లా నుంచి వయా ఠాణే మీదుగా వనపర్తి, మమ్తాబాద్, మరిక్కల్  (కొండాపూర్)లతోపాటు కుర్లా-నారాయణపేట బస్సు ఉంది. అదే విధంగా బోరివలి నుంచి కరీంనగర్‌తోపాటు తాజాగా ప్రారంభమైన సిద్దిపేట బస్సు, పరెల్ నుంచి ధర్మపురి-లక్షెట్టిపేట, గోరేగావ్-నార్కట్‌పల్లి బస్సులున్నాయి. కుర్లా, పరెల్, బోరివలి, గోరేగావ్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరినప్పటికీ కొన్ని బస్సులు వయా ఠాణే మీదుగా మరి కొన్ని బస్సులు సైన్ మీదుగా పన్వెల్ పుణే మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో మరి కొన్ని బస్సులను పెంచాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా భివండీ, ఠాణే ప్రాంతాల నుంచి జగిత్యాల మార్గంలో బస్సులు ప్రారంభించాలని కోరుతున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top