తమిళ యూత్ తర్వాతి టార్గెట్ ఫిక్స్‌!

తమిళ యూత్ తర్వాతి టార్గెట్ ఫిక్స్‌!


చెన్నై: జల్లికట్టును కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్న తమిళ యువత తర్వాత అన్నదాతల కోసం పోరాడనుంది. కర్షకులను కష్టల్లోకి నెడుతున్న బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టాలని యువకులు భావిస్తున్నారు. శీతల పానీయాలు తయారు చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల సంక్షేమం తమ తర్వాతి ఎజెండా అని జల్లికట్టు ఆందోళనలో పాల్గొన్న ఉద్యమకారులు వెల్లడించారు.



అన్నదాతలకు నీళ్లు దక్కకుండా దోచుకుంటున్న కోకాకోల, పెప్సీలను నిషేధించాలన్న డిమాండ్ తో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. బహుళజాతి కంపెనీలు తమ వ్యాపార అవకాశాల కోసం నీటిని వాడుకుంటూ పంటలకు అందకుండా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఎంఎన్సీలకు వ్యతిరేకంగా కోయంబత్తూరులో యువత కూల్ డ్రింక్స్ బ్యాటిల్ ను విసిరేసి నిరసన తెలిపింది. వీరికి పలు హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలు మద్దతు ప్రకటించాయి. కోక్, పెప్సి సర్వ్ చేయబోమని పలు హోటళ్లు బోర్డులు పెట్టాయి.



‘మా సంస్థకు అన్ని బ్రాంచుల్లో పెప్సి, కోక్ ఉత్పత్తులు సర్వ్ చేయడం నిలిపివేశామ’ని ఆర్ హెచ్ ఆర్‌ హోటల్‌ మెయిన్ కౌంటర్‌ వద్ద బోర్డు పెట్టింది. బహుళజాతి సంస్థలు తయారు చేస్తున్న శీతలపానీయాలు ఆరోగ్యానికి హానికరమని కొంతమంది ఆందోళనకారులు పేర్కొంటున్నారు. వీటిపై నిషేధం విధించలేకపోయినా కనీసం అమ్మకాలను నియత్రించాలని వారు కోరుతున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top