అలా మొదలైంది నా కెరీర్

అలా మొదలైంది నా కెరీర్


భానుమతి, సావిత్రి, విజయనిర్మల వీరంతా బహుముఖ ప్రజ్ఞాశాలులు...రోహిణి కూడా అంతే... వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు...బాహుబలి చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించారు...నటి, గేయ రచయిత, స్క్రీన్‌ప్లే, డబ్బింగ్ ఆర్టిస్ట్,

డెరైక్టర్ అయిన రోహిణి దక్షిణ భారత  భాషల్లో ముఖ్యంగా మలయాళ, తమిళ చిత్రాల్లో మంచి నటిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం స్రవంతి మూవీస్ బ్యానర్‌లో రామ్ హీరోగా నిర్మితమవుతున్న ‘హరికథ’ చిత్రంలో రోహిణి నటిస్తున్నారు. సాక్షితో తన అనుభవాలు పంచుకున్నారు.
ఆ వివరాలు...

 

 నా గురించి...


 ఆంధ్రప్రదేశ్, అనకాపల్లిలో పుట్టాను. చెన్నైలో స్థిరపడ్డాను. 1976లో నా ఐదవ ఏట యశోదకృష్ణ చిత్రం ద్వారా బాలతారగా వెండితెరకు పరిచయమయ్యాను. నాటి నుంచి ఇంక వెనుదిరగలేదు. ఇప్పటివరకు 130 చిత్రాలకు పైగా నటించాను. 1996లో ప్రత్యేక జాతీయ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డు (స్త్రీ చిత్రం) అందుకున్నాను. ఇంక నాలుగు స్తంభాలాట, ఆడవాళ్లకు మాత్రమే వంటి చిత్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది. నా నటనకుగాను తమిళనాడు ప్రభుత్వం నన్ను కలైమామణి బిరుదుతో సత్కరించింది. ప్రయివేట్‌గా ఎం.ఏ ఇంగ్లిషు పూర్తిచేశాను. నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఎన్నో పుస్తకాలు చదవడం వల్లే కథలు, సీరియల్స్ పాటలు రాయగలిగాను. వాటికి గుర్తింపు సాధించాను. రఘువరన్‌ని వివాహం చేసుకున్నానని అందరికీ తెలిసిందే. మాకు ఒక బాబు. వాడి పేరు రిషివరన్. ప్లస్‌టూ చదువుతున్నాడు. ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం జీవితంలో ఒక భాగం అయిపోయింది.

 

 అలా మొదలై ంది...

 ‘అలా మొదలైంది’ సినిమా కథను నందిని నాకు సీన్స్‌గా చెప్పినప్పుడు నెరేషన్ బాగా నచ్చడంతో అంగీకరించాను. నన్ను తల్లిగా పరిచయం చేసిన పాత్ర అది. మొట్టమొదటగా తెలుగులో తల్లిగా చేసిన చిత్రం ఇది. అంతకుముందు ఎవరు అడిగినా తల్లిపాత్రలు చెయ్యనన్నాను. ఇందులో కూడా ఆ పాత్ర నాకు జీవితానికి దగ్గరగా అనిపించడంతో అంగీకరించాను. ఎందుకంటే నేను మా అబ్బాయితో ఆ విధంగానే ప్రవర్తిస్తాను.  మహిళాదర్శకురాలు కాబట్టి సపోర్ట్ చేయాలనుకున్నాను. పాత్ర కూడా బాగా నచ్చడంతో సరే అన్నాను. నేను ఆ సినిమా చేసేటప్పుడు నందినితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాను. ఆ సినిమాలో మేమందరం రియలిస్టిక్‌గా చెయ్యాలనుకున్నాం,చేశాం. తమిళం, మలయాళ భాషల్లో రియలిస్టిక్‌గానే చేస్తారు. తెలుగులో అప్పట్లో ఇలాంటి నటనను ఒప్పుకునేవారు కాదు. ‘అలా మొదలైంది’లో ఈ తరహా నటనకు అంగీకరించారు. భావోద్వేగాలతో నటించాల్సి వచ్చినప్పుడు నందిని చాలా చక్కగా చేయించింది. అందుకే తనతో నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. అలా మొదలైంది సినిమా నాకు బాగా హెల్ప్ అయ్యింది. టైస్టు క్యారెక్టర్, సమాజంలో మంచి జరగడం కోసం పోరాడే పాత్ర చేయాలని ఉంది.

 

 నటి, రచయిత, దర్శకురాలిగా ...

 నచ్చని పాత్రలు చేయను. నచ్చినవి మాత్రమే చేస్తాను. నాకు ఎక్కడ నచ్చకపోయినా సర్దుకుపోలేను. అవతలి వారి మనసు నొప్పించకుండా పక్కకి తప్పుకుంటాను. కొన్ని తమిళ చిత్రాలకు పాటలు రాశాను. గీతరచయితగా బాగానే గుర్తింపు వచ్చింది. ఎంజీఆర్ మెడికల్ విశ్వవిద్యాలయం వారి కోసం కొన్ని లఘు చిత్రాలు నిర్మించాను. 50 నిమిషాల నిడివితో ‘సెలైంట్ హ్యూస్’ పేరుతో సినీ పరిశ్రమలోని బాల తారల మీద ఒక డాక్యుమెంటరీ తీశాను. నేను దర్శకత్వం వహించిన ‘అప్పావిన్ మీసై’ (నాన్న మీసం అని అర్థం)  చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అనేక టీవీ చానల్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాను. చాలా సీరియల్స్‌కి, సినిమాలకి స్క్రీన్‌ప్లే రాశాను. చేరన్‌గారి ప్రొడక్షన్‌లో ఒక తమిళ సినిమా డెరైక్ట్ చేస్తున్నాను. త్వరలో విడుదల కావొచ్చు. చాలా సంవత్సరాలుగా డెరైక్షన్ చేయాలనే నా కోరిక ఈ విధంగా తీరబోతోంది.

 

 డబ్బింగ్ ఆర్టిస్టుగా...

 మణిరత్నంగారి‘గీతాంజలి’ చిత్రంలో గిరిజకు ఇచ్చిన డబ్బింగ్ అందరికీ బాగా నచ్చింది. ఆ తరవాత రామ్‌గోపాల్‌వర్మగారి ‘శివ’ చిత్రంలో అమలకి డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా సమయానికి రామ్‌గోపాల్‌వర్మ అంటే ఎవ్వరికీ తెలియదు. నేను అప్పటికి హీరోయిన్‌గా చేస్తున్నాను. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉండిపోవలసి వస్తుందేమోనని భయపడ్డాను. కాని అది కూడా చాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఆ సినిమా మూడు రీల్స్ చూసి సినిమా తీసిన విధానం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తరవాత బొంబాయి చిత్రంలో మనీషా కొయిరాలాకు డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా డబ్బింగ్ చెబుతుంటే కళ్లలో నీళ్లు వచ్చాయి.

 

 ఆ పాత్రలో పూర్తిగా మునిగిపోయాను. ఎంత డబ్బింగ్ ఆర్టిస్టుగా ఉన్నా, వచ్చిన ప్రతి డబ్బింగూ అంగీకరించడానికి ఇష్టపడను. నా గొంతు వాళ్లకి సరిపోతుందనుకుంటేనే అంగీకరిస్తాను. బాగుండదనుకుంటే వాళ్లని నొప్పించకుండా తిరస్కరిస్తాను. క్యారెక్టర్ అనేవారు. అది నా గొంతు అని తెలిస్తే క్యారెక్టర్ పోతుంది. అందుకే ఎంతో జాగ్రత్తగా డబ్బింగ్ చెబుతాను. మనం డబ్బింగ్ చెప్పినా సినిమాల్లో క్యారెక్టర్ కనపడాలేకాని, గొంతు డామినేట్ చేయకూడదు. మణిరత్నంగారు ఎప్పుడూ ‘డబ్బింగ్’ అనే పదం వాడేవారు కాదు. రాఘవన్ చిత్రానికి జ్యోతికకు నా గొంతు సరిపోయింది. ఒక చిత్రంలో త్రిషకు డబ్బింగ్ చెప్పమన్నారు. కొద్దిగా చెప్పేసరికి బాగాలేదని నేనే వదిలేశాను. ఏ పాత్రకైనా నా గొంతు బాగాలేకపోతే మానేస్తాను.

 

 నాలుగు స్తంభాలాట గురించి...


 ప్రస్తుతం నేను చేస్తున్న స్రవంతి మూవీస్ చిత్రం ‘నాలుగుస్తంభాలాట’లో నటించిన నరేష్‌గారు కూడా ఉన్నారు. మేమిద్దరం ఆ చిత్రం గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ చిత్రంలో జంధ్యాల గారు నాకు ఇచ్చిన పాత్ర బరువైనది. ఆ సినిమా సమయానికి నాకు నటన అంటే పూర్తిగా తెలియదు. అర్థం చేసుకునే వయసు కాదు. అది వయసుకి మించిన పాత్ర కూడా. జంధ్యాలగారు ఏది చెప్తే అది ఆడుతూ పాడుతూ చేసేశాను. ఇప్పుడు చూస్తే ఒక బొమ్మలాటలా అనిపిస్తుంది నాకు. నా క్యారెక్టరే అనుకుంటే పూర్ణిమ క్యారెక్టర్ కూడా వయసుకి మించిన బరువైన పాత్ర. జంధ్యాలగారు చాలా బాగా చేయించారు. అందులో మా గొప్ప ఏమీ లేదు.

 

 రాజమౌళిగారితో పనిచేయడం గురించి....

 బాహుబలి చిత్రంలో అడవిజాతి పాత్రలో హీరో తల్లిగా నటించానని తెలిసిందే కదా. రాజమౌళిగారితో పనిచేయడం చాలా బావుంటుం ది. నేనే కాదు అందరూ ఆ మాటే చెప్తారు. ఆయన అనుకున్నట్లు వచ్చేవరకు ఊరుకోరు. పని అంటే అంకితభావంతో ఉంటారు ఆయన. తనకు కావలసింది వచ్చేవరకు ముందుకు వెళ్లరు. బాలూమహేంద్ర, కమలహాసన్ వంటి వారితో ఈ విధంగా పనిచేసేవాళ్లం. సాధారణంగా కళాత్మక చిత్రాలకు మాత్రమే ఇటువంటి డెడికేషన్ ఉంటుంది. కాని ఒక వ్యాపారాత్మక చిత్రానికి రాజమౌళిగారు ఇంత కష్టపడి, ఎంతో దీక్షతో మా చేత చేయించారు. ఈ సినిమాలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా మిటిక్యులస్‌గా చేశాం. ఇంతవరకు ఎక్కడా చూడని, చేయని ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ చేశాం. ఈ చిత్రం షూటింగ్ 25 రోజులు కేరళలో చేశాం.

 

 బాహుబలి పాత్రచిత్రణ...

 ఈ పాత్రచిత్రణ మాత్రం చాలా విలక్షణంగా ఉంది. ఆ పాత్ర నేపథ్యం బట్టి, వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, పూజా విధానం ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన మాకు చాలా బాగా చూపించారు. ఎలాంటివి పెట్టి పూజలు చేసుకోవాలనే విషయాన్ని మాకు చాలా సేపు వివరించారు. నాకు చాలా ఇంటరెస్టింగ్‌గా అనిపించింది.  - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, చెన్నై

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top