అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా?

అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా?


 అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా? సంఘం నుంచి బహిష్కరించినా భయపడను అంటున్నారు నటుడు విశాల్. సంఘంపై తరచూ విమర్శలు చేస్తే, నటుడు విశాల్‌పై వేటు వేస్తామని దక్షిణ భారత నటీనటులసంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ బుధవారం తిరుచ్చిలో చేసిన వ్యాఖ్యలకు నటుడు విశాల్ స్పందించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ నటీనటుల సంఘం నుంచి తనను బహిష్కరిస్తానన్న శరత్‌కుమార్ వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ఆ వ్యాఖ్యలు తన సినీ జీవితాన్ని వేదనకు గురి చేసేవిగా ఉన్నాయన్నారు. నటీనటుల సంఘం కార్యదర్శి రాధారవి, ఉపాధ్యక్షుడు కె ఎస్‌కాళైలు ఇటీవల మదురైలో రంగస్థల నటులకు సాయం అందించే కార్యక్రమంలో పాల్గొని సినిమా నటులను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు.

 

 దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. నిజానికి నటీనటుల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరడం తప్పా? అంటు ప్రశ్నించారు. సభ్యుడిగా సంఘం చర్యలపై ప్రశ్నించే హక్కు తన కుందన్నారు. సంఘం భవన నిర్మాణం గురించి అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి పూర్తి వివరాలను ఇప్పటి వరకు సభ్యులకు తెలియపరచకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. సంఘం నిర్వాహకుల గురించి ప్రశ్నించే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుందని విశాల్ ఉద్ఘాటించారు. సంఘం గురించి తాను చేసిన విమర్శలు ఏమిటో నిరూపిస్తే తానే సంఘం నుంచి వైదొలగుతానని విశాల్ అన్నారు.  

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top