చెత్త కుప్పల నుంచి అంతర్జాతీయ వేదికకు

చెత్తను వాహనంలో తరలిస్తున్న మన్సూర్ అహ్మద్


బెంగళూరులో చెత్తకుప్పల్లో ఉన్న ప్లాస్టిక్, ఇనుప ముక్కలను ఏరుకుని జీవనంసాగిస్తున్న ఓ యువకుడు అంతర్జాతీయ వేదికపై ప్రపంచ పర్యావరణ పరిరక్షణ గురించి ప్రసంగించనున్నాడు. ఇందుకు అవసరమైన సహకారాన్ని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'హసిరు దళ' అనే సంస్థ అందిస్తోంది. బెంగళూరులోని జయనగర్‌కు చెందిన ముప్పై మూడేళ్ల మన్సూర్ అహ్మద్ స్థానిక గృహాలు, పరిశ్రమల నుంచి ఘన వ్యర్థాలను సేకరించి అక్కడే ఉన్న డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్ (డీడబ్ల్యూసీసీ)కు చేరుస్తుంటాడు.

 


ఈ విధంగా నెలకు సుమారు 10 నుంచి 12 టన్నుల డ్రైవేస్ట్‌ను డీడబ్ల్యూసీసీకు చేరుస్తున్నాడు. అలాగే ఇంటి వద్దే పొడి, తడి చెత్తను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై స్థానికులకు అవగాన కల్సిస్తుంటాడు. ఏడోతరగతి వరకూ మాత్రమే చదివిన మన్సూర్‌కు వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఉన్న శ్రద్ధను గుర్తించిన 'హసిరు దళ' సంస్థ నగరంలోని చాలా ప్రాంతాల్లో మన్సూర్‌తో కలిసి జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


ఈ నేపథ్యంలోనే ప్యారిస్‌లో నవంబర్ 30న ప్రారంభమైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) 21కు ఎంపిక చేసింది. అంతేకాకుండా ఇండియన్ యూత్ క్లైమెట్ నెట్‌వర్క్ (ఐవైసీఎన్), అలియన్స్ ఆఫ్ ఇండియన్ వేస్ట్ పిక్కర్ (ఏఐడబ్ల్యూ) సహకారంతో సీఓపీలో ప్రసంగించే అవకాశం కల్పించింది. ఈ నెల 11 వరకూ జరిగే ఈ సదస్సులో ఇంటి వద్దే పొడి, తడి చెత్తలను వేరు చేసేలా ప్రజలను ఎలా ఒప్పించింది, అందుకు అనుసరించిన విధానాలపై ప్రసింగించనున్నారని ఏఐడబ్ల్యూ సభ్యుడు కబీర్ అరోరా చెప్పారు. ఇక ప్యారిస్ ప్రయాణంపై మన్సూర్ అహ్మద్ ఎంతో ఉత్సుకతతో ఉన్నారు.




నా జీవితంలో ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించలేదు. మా నాన్న చనిపోవడంతో చిన్ననాటి నుంచి బెంగళూరు వీధుల్లో చెత్తను ఏరుకుంటూ మా అమ్మతో పాటు ఆరుగురు చెళ్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లను పోషించాను. నేను చేసే పనిలో నిబద్ధతతో వ్యవహరించడమే నాకు చిన్నతనం నుంచి అలవాటు. ఆ నిబద్ధతే ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించిందని భావిస్తున్నాను. వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ప్యారిస్‌లో అవలంభిస్తున్న విధానాలను తెలుసుకుని వాటిని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నిస్తాను

-మన్సూర్ అహ్మద్

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top