కొడుకు కోసం 16 ఏళ్లుగా ఎదురుచూపు

కొడుకు కోసం 16 ఏళ్లుగా ఎదురుచూపు


షార్జాజైలులో మగ్గుతున్న జగిత్యాల జిల్లా వాసి

రాయికల్‌: పొట్ట చేత పట్టుకొని దేశం కాని దేశం వెళ్లిన కొడుకు కటకటాల్లో మగ్గుతున్నాడు. ఎప్పుడొస్తాడో... ఎలా ఉంటాడో తెలియక ఇక్కడ 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ తల్లి దీనగాథ ఇది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కొత్తపేటకు చెందిన ధరూర్‌ లక్ష్మి కుమారుడు బుచ్చన్న అలియాస్‌ బక్కన్న 16 ఏళ్ల క్రితం  దుబాయ్‌ వెళ్లాడు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం ముక్కాల గ్రామానికి చెందిన గోవర్ధన్ తో కలసి ఓ గదిలో ఉండేవాడు.


2001 ఏప్రిల్‌ 15న జరిగిన చిన్న ఘర్షణలో ప్రమాదవశాత్తు గోవర్ధన్‌ మృతి చెం దాడు. దీంతో బుచ్చన్నను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి షార్జా సెంట్రల్‌ జైలులో పెట్టింది. న్యాయ స్థానం బుచ్చన్నను కాల్చి చంపాలని తీర్పునిచ్చింది. విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం స్పందించి బుచ్చన్నకు ప్రాణభిక్ష పెట్టేలా చర్య తీసుకుంది. బుచ్చయ్యను జైలు నుంచి విడిపించేందుకు  గోవర్ధన్  బంధువుల అనుమతి కావాలని అక్కడి ప్రభుత్వం నిబంధన విధించారు. దీనికి అతడి బంధువులు ససేమిరా అన్నారు.


నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో గతంలో ఆర్డీవో సమక్షంలో ఇరువర్గాలను విచారించగా మృతుని బంధువులు రూ.3.80 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదరికంలోఉన్న తాము అంత డబ్బు ఇచ్చుకోలేమని ప్రాధేయపడినా ఫలితం లేదు. దీంతో బుచ్చన్నకు జైలు జీవితం తప్పలేదు. ఈ క్రమంలో 16 ఏళ్లుగా బుచ్చన్న షార్జా జైలులోనే ఉన్నాడు. వృద్ధ్యాపంలో ఉన్న తనను ఆదుకునేందుకు కొడుకు వస్తాడని ఆశిస్తున్న ఆ తల్లి.. తన కొడుకు బుచ్చన్నకు జైలు నుంచి విముక్తి చేసేలా మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత స్పందించాలని ఆమె కోరుతోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top