108కి టెండర్


జీవీకే నుంచి బీవీకేకు మారనున్న బాధ్యతలు

నెలాఖరు వరకే ఉద్యోగుల గడువు

ఇప్పటికే అందిన నోటీసులు

భవిష్యత్తుపై సిబ్బంది ఆందోళన

 

ఒంగోలు సెంట్రల్  : 108 వాహన ఉద్యోగులకు మళ్లీ కష్టాలొచ్చాయి. వాహనాల నిర్వహణ బాధ్యతను జీవీకే గ్రూపు నుంచి భారత్ వికాస్ గ్రూప్‌నకు అప్పగిస్తున్నారు. ఉద్యోగులకు నెలాఖరుతో ఉద్యోగాల కాలపరిమితి ముగుస్తుందని సంస్థ నుంచి ముందస్తు సమాచారం అందింది. దీంతో తమ భవిష్యత్తు ఏమిటని సిబ్బంది ఆందోళనలో ఉన్నారు.  

 

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో  భాగంగా 108 వాహనాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆరంభంలో కొద్ది రోజులు బాగానే తిరిగినా.. కానీ ఆ తర్వాత రకరకాల సమస్యలు చుట్టుముట్టారుు. జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. మండలానికి కనీసం ఒకటి చొప్పున 108 వాహనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జిల్లాకు కేవలం 32 అంబులెన్సులనే కేటాయించారు. వాహనాలను కేటాయించినా అనంతర కాలంలో కొన్ని మరమ్మతులకు గురైతే, వాటని కూడా లెక్కలోనే ఉంచుతున్నారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం 3 వాహనాలు మాత్రమే జిల్లాకు కొత్తవి వచ్చాయి. ప్రారంభంలో సత్యం గ్రూపు 108ను నిర్వహించింది.  వాహనాల నిర్వహణకు, సిబ్బంది జీత భత్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లిస్తుంది. అనంతరం జీవీకే సంస్థకు అప్పగించారు. అయితే ప్రస్తుతం జీవీకే సంస్థకు ఇచ్చిన గడువు తీరిపోవడంతో బీవీకే గ్రూపు టెండర్ దక్కించుకుంది. దీంతో 108 సిబ్బందిలో ఆందోళన మొదలైంది. నూతన సంస్థ వస్తే ప్రస్తుతం ఉన్న సిబ్బందిని తొలగించి తమకు అనుకూలమైన వారిని నియమించుకునే అవకాశం ఉంది.

 

108 వాహనాల్లో సమస్యలు:

ఒక్కో 108 వాహనంలో ముగ్గురు సాంకేతిక నిపుణులు, ముగ్గురు పెలైట్లు ఉండాలి. ఇదే విధంగా ప్రతి 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున 24 గంటలు ముగ్గురు పని చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి 108 వాహనానికి ఇద్దరు చొప్పున మాత్రమే సిబ్బందిని నియమించారు. దీంతో ఒక్కో షిఫ్టులో సిబ్బంది  12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. పైగా 108 వాహనాల్లో ఆక్సిజన్ సౌకర్యం కూడా సరిపోయేలా ఉండటం లేదు. 

 

సరిగా లేని వాహనాల నిర్వహణ:

108 వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. సాంకేతిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి. కనీసం తలుపులు కూడా తెరుచుకోని వాహనాలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతి వాహనానికి ఇంజిన్ సమస్యలు తలెత్తి మధ్యలోనే ఆగిపోతున్నాయి. టైర్లు అరిగిపోయి ఎక్కడికక్కడ పంక్చర్ అవుతున్నాయి. ఉన్న వాహనాల్లో చాలా వరకూ 11 ఏళ్ల కిందటివే ఉన్నాయి. వాటి స్థానంలో కొన్నిటిని మాత్రమే ఇచ్చారు. మిగిలినవి పాత వాహనాలే. అన్నింటికీ మించి పది మండలాలకు వాహన సౌకర్యం లేదు. 108 సేవల పేరుతో ప్రజాధనం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు.  ప్రస్తుతం భారత్ వికాస్ గ్రూపుకు 108 సేవలకు గానూ ఒక్కో వాహనానికి నెలకు  రూ.1.13 లక్షలు చెల్లించేది. అయితే నూతనంగా టెండర్‌ను దక్కించుకున్న సంస్థకు రూ.1.30 లక్షలు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ వాహనాలు ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటంతో, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడంలేదు. 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top