పరీక్ష రాసేదెలా?

పరీక్ష రాసేదెలా?

పాపన్నపేట: వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కాబోయే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 10,924 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఇందులో 53 ప్రభుత్వ పాఠశాలలుండగా.. 14 ప్రైవేటు కేంద్రాలున్నాయి. ఒక్కో సెంటర్‌కు చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌ మెంటల్‌ ఆఫీసర్‌తో పాటు సీ సెంటర్లకు పేపర్‌ కస్టోడియన్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఇతర అధికారులు.. ఇన్విజిలేటర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.

 

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఫర్నిచర్‌ సమస్య !

జిల్లాలో మొత్తం 67 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయగా అందులో 53 ప్రభుత్వ పాఠశాలలు..14 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫర్నిచర్‌ సమస్య లేక పోయినప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇబ్బందులున్నాయి. స్థానిక పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌ లేక పోవడంతో మండల విద్యాధికారులు ప్రతి యేటా పక్క స్కూళ్ళ నుంచి గాని, టెంట్‌ హౌస్‌ల నుంచి గాని ఫర్నిచర్‌ను పరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇందు కోసం ఒక్కో ఎంఈఓ యేటా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే పరీక్షలు రాసేందుకు డ్యూయల్‌ డెస్కులైతేనే అనుకూలంగా ఉంటాయి. 

 

కాని 9 పరీక్ష కేంద్రాల్లో ఒక్క డ్యూయల్‌ డెస్కు కూడా లేనట్లు సమాచారం. ఇక 21 కేంద్రాల్లో 50 లోపు డెస్కులున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సెంటర్‌లో ఎంత లేదన్నా 100కు పైగానే విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. దీంతో ఎంఈఓలు లాంగ్‌ బెంచీలు..టెంట్‌హౌస్‌ కుర్చీలు సమకూరుస్తున్నారు. వాటిపై కూర్చోవడమే ఇబ్బందిగా మారుతోందని.. ఇక పరీక్షలు ఎలా రాయాలంటు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

‘పదో తరగతి విద్యార్థులు నేల మీదకూర్చుని పరీక్షలు రాస్తే చీఫ్‌ సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకుంటాం.. ఫర్నిచర్‌ సమకూర్చాల్సిన బాధ్యత మండల విద్యాధికారులదే.. కాని అందుకు సంబంధించి రవాణా ఛార్జీలు.. కిరాయిలు మమ్మల్ని అడగొద్దు’ -విద్యాధికారుల ఆదేశాలు 

 

‘ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలకు కావాల్సిన ఫర్నిచర్‌ సమకూర్చేందుకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుంది. కాని అధికారులు రూపాయి కూడా చెల్లించడం లేదు. ప్రతి ఏటా మేము ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి’ - మండల విద్యాధికారుల ఆవేదన

 

‘లాంగ్‌ బెంచీలు.. ప్లాస్టిక్‌ కుర్చీలపై పరీక్షలు రాయాలంటే చాలా అసౌకర్యంగా, చికాకుగా ఉంది. అందు వల్ల పరీక్షలు సరిగా రాయలేక పోతున్నాం.’- విద్యార్థుల గోస

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top