'ఆ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది'

'ఆ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది'


న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడానికి ఆ జట్టు స్టార్ ఆటగాడు యువరాజ్ సింగే కారణమని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. సన్ రైజర్స్ క్లిష్టసమయంలో ఉన్నప్పుడు యువరాజ్ బ్యాట్ చెలరేగి విలువైన పరుగులను నమోదు చేశాడన్నాడు.


 


'యువరాజ్ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అది కచ్చితంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన ఇన్నింగ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.  సరైన సమయంలో యువరాజ్  బ్యాట్ ను ఝుళిపించడంతో సన్ రైజర్స్ కు అదృష్టాన్ని తీసుకొచ్చింది' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. యువరాజ్ ఇన్నింగ్స్ కు తోడు హైదరాబాద్ బౌలర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, భువనేశ్వర్లు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని స్పష్టం చేశాడు. వారిద్దరూ అత్యుత్తమ స్లాగ్ ఓవర్ల జోడి అని ప్రశంసించాడు. కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఆండ్రీ రస్సెల్ లేకపోవడం కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నాడు. అతని స్థానంలో ఆర్ సతీష్ను జట్టులో వేసుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. ప్రధానమైన మ్యాచ్ లో సతీష్ కు జట్టులో స్థానం కల్పించి కెప్టెన్ గౌతం గంభీర్ తగిన  మూల్యం చెల్లించుకున్నాడని ఆకాశ్ చోప్రా విమర్శించాడు.  బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కు అర్హత సాధించింది.  సన్ రైజర్స్ 71 పరుగులకే మూడు ప్రధానమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న తరుణంలో యువరాజ్ సింగ్ 30 బంతుల్లో 44 పరుగులు నమోదు చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top