యువరాజ్ ఒకే ఒక్కడు..

యువరాజ్ ఒకే ఒక్కడు..


కటక్: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా యువరాజ్(150) అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేసి తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు.  ఈ క్రమంలోనే ఇంగ్లండ్పై అత్యధిక వన్డే వ్యక్తిగత పరుగులు సాధించిన ఏకైక భారత క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ పై గతంలో తన పేరిటే ఉన్న అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును యువీ సవరించాడు.



2008లో ఇంగ్లండ్ పై యువరాజ్ నమోదు చేసిన 138 వ్యక్తిగత పరుగులే ఇప్పటివరకూ భారత్ తరపున అత్యధికం. దాన్ని యువరాజ్ తాజాగా అధిగమించడమే కాకుండా, వన్డే కెరీర్లో అత్యధిక పరుగుల్ని నమోదు చేశాడు. ఇంగ్లండ్ పై అత్యధిక పరుగులు చేసిన అంతర్జాతీయ క్రికెటర్లలో వివియన్ రిచర్డ్స్(189నాటౌట్), గప్టిల్(189 నాటౌట్)లు తొలి స్థానంలో ఉండగా, షేన్ వాట్సన్(161) రెండో స్థానంలో,  సనత్ జయసూర్య(152) మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత హషీమ్ ఆమ్లా(150), యువరాజ్(150)లు సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు.





మరొకవైపు ఇంగ్లండ్ పై అత్యధిక స్కోరు నమోదు చేసే అవకాశాన్ని భారత్ జట్టు తృటిలో చేజార్చుకుంది. 2015లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ 398/5 పరుగులు చేసింది. ఇదే ఓవరాల్ గా వన్డేల్లో ఇంగ్లండ్ పై అత్యధిక స్కోరు. ఆ తరువాత స్థానంలో భారత్ జట్టు  387/5 ఉంది.  2008లో రాజ్ కోట్ లో భారత్ ఇంగ్లండ్ పై అత్యధిక పరుగుల్ని సాధించింది. అయితే తాజా మ్యాచ్లో భారత్ జట్టు మరొక 18 పరుగులు చేసి ఉంటే ఇంగ్లండ్ పై అత్యధిక వన్డే స్కోరు సాధించిన జట్టుగా నిలిచేది. ఇదిలా ఉంచితే  వన్డేల్లో నాల్గో వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసే అవకాశాన్ని యువీ-ధోనిల జోడి తృటిలో మిస్సయ్యింది. గతంలో జింబాబ్వేపై అజహరుద్దీన్-అజయ్ జడేజాలు 275 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఇదే ఓవరాల్ గా నాల్గో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం. తాజాగా యువీ-ధోనిలు నమోదు చేసిన 256 పరుగుల నాల్గో వికెట్ భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత పాంటింగ్-సైమండ్స్ లు నమోదు చేసిన 237 పరుగుల నాల్గో వికెట్ భాగస్వామ్యం మూడో స్థానంలో ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top